ఒంగోలు, న్యూస్‌లైన్: అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృఢ సంకల్పంతో నిరాహార దీక్ష చేసినా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, ఈ సర్కారును జనం క్షమించరని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ పార్టీ
తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద రోడ్లు ఊడ్చే కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ శనివారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నూకసాని మాట్లాడుతూ గతంలో చంద్రబాబు మోసపూరిత ఉద్దేశంతో నిరాహార దీక్షకు కూర్చోగానే రాష్ట్రమంత్రివర్గంలోని వారు హుటాహుటిన ఆయన వద్దకు చేరుకుని పరామర్శించారన్నారు. కానీ తెలుగు జాతిని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేసినా..ప్రభుత్వంలోని ఒక్కరు కూడా స్పందించకపోవడం బాధాకరమన్నారు.
రాష్ట్రం విచ్ఛిన్నమైతే అభివృద్ధి కుంటుపడుతుందని, సాగుభూములు సైతం బీళ్లుగా మారుతాయని చెప్పారు. తాగునీటికి సైతం కటకటలాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జైలులో ఉండి సైతం జనం సమస్యలపై జగన్‌మోహన్‌రెడ్డి నినదిస్తుంటే జనంలో ఉండి..నాయకులమని చెప్పుకుంటున్న సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ప్రతిపక్ష నేత మొత్తం రాజీనామాల పేరుతో మోసం చేయాలనుకోవడం జనం గమనిస్తూనే ఉన్నారన్నారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ జగన్ గాంధేయ మార్గంలో దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన చర్యలను నిరసించడమే కాకుండా జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ పార్టీ దృష్టి సారించిందని నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ అన్నారు.
ఆత్మగౌరవ యాత్రల పేరుతో జనంలోకి రావాలని చూస్తున్న నాయకులకు సరైన గుణపాఠం చెప్పేందుకు జనమే సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి కొఠారి రామచంద్రరావు, వివిధ విభాగాల కన్వీనర్లు కేవీ రమణారెడ్డి, కేవీ ప్రసాద్, కఠారి శంకర్, పోకల అనూరాధ, జిల్లా యువజన అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, గంగాడ సుజాత, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, ముదివర్తి బాబూరావు, నెరుసుల రాము, యరజర్ల రమేష్, రొండా అంజిరెడ్డి, కత్తినేని రామకృష్ణారెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, వంకే రాఘవరాజు, మాజీ కౌన్సిలర్ వెలనాటి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష భగ్నం చేసినందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కనిగిరిలో రిలే దీక్ష ప్రారంభించారు. దీనిని కనిగిరి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ముక్కు కాశిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వైఎం ప్రసాదరెడ్డి తదితరులు ప్రారంభించారు. కనిగిరిలో ఆరుగురు, సీఎస్‌పురంలో పది మంది, పామూరులో తొమ్మిది మంది దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముక్కు కాశిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిన కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోకూడదన్న జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష సఫలం కావాలని కోరుకుంటూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పర్చూరులో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో వైఎస్సార్ సీపీ నాయకులు భవనం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు.
సంతనూతలపాడులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన రిలే దీక్షకు పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ సంఘీభావం తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి తదితరులు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షను బలవంతంగా భగ్నం చేయడాన్ని తప్పుబట్టారు. దీక్షలో 30 మంది కూర్చున్నారు. కార్యక్రమంలో ప్రచార విభాగం జిల్లా కన్వీర్ వేమూరి సూర్యనారాయణ(బుజ్జి) తదితరులు పాల్గొన్నారు. చీరాలలో అవ్వారు ముసలయ్య, మరో ఆరుగురు గడియారస్తంభం సెంటర్‌లో రిలే దీక్ష చేపట్టారు.
సర్కారును జనం క్షమించరు
Published Sun, Sep 1 2013 3:12 AM | Last Updated on Tue, May 29 2018 5:24 PM
Advertisement
Advertisement