ఆగని ఉద్యమం
Published Sun, Oct 27 2013 2:34 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
సాక్షి, రాజమండ్రి : జిల్లావ్యాప్తంగా 87వ రోజు కూడా ఉద్యోగ, విద్యార్థి లోకం సమైక్య శంఖారావం పూరించారు. రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలంటూ ఉద్యోగులు శనివారం ర్యాలీలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీక్షలను అకుంఠిత దీక్షతో కొనసాగించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ దీక్షలు
రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దీక్షలు కొనసాగుతున్నాయి. నగరంలోని 45వ డివిజన్‌కు చెందిన యువకులు దీక్షల్లో పాల్గొన్నారు. కడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 26వ రోజులకు చేరుకున్నాయి. కడియపులంక గ్రామానికి చెందిన కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. ఏలేశ్వరంలో పార్టీ కార్యక్తలు మెయిన్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. ఏలేశ్వరం, జగ్గంపేటల్లో పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
జేఏసీ ర్యాలీలు
కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు ఆశీర్వాదం, పితాని త్రినాథరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. అమలాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ చేశారు. కొత్తపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముమ్మిడివరంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు 216 జాతీయ రహదారిపై రాసారోకో చేశారు. రాజమండ్రిలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి.
విశాఖపట్నం వెళ్లిన న్యాయవాదులు
శనివారం విశాఖపట్నంలో సీమాంధ్ర జేఏసీ నిర్వహించిన సభకు సంస్థ కోకన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో న్యాయవాదులు రాజమండ్రి నుంచి భారీఎత్తున తరలివెళ్లారు. పెద్దాపురం నుంచి కూడా వెళ్లారు. పెద్దాపురం, కాకినాడ, రాజమండ్రి కోర్టు కాంప్లెక్సుల వద్ద న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు దీక్షలను కొనసాగిస్తున్నారు.
Advertisement
Advertisement