రూ. వెయ్యి కోసం ఎంత పని చేశాడు !
మదనపల్లె: అప్పుగా తీసుకున్నరూ.వెయ్యి సకాలంలో ఇవ్వలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి కత్తితో యువకుడి గొంతు కోశాడు. ఈ సంఘటన ఆదివారం చౌడేపల్లె మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పందిళ్లపల్లె పంచాయతీ బాల సముద్రానికి చెందిన రాయల అంజప్ప కుమారుడు రమేష్(35) కొంత కాలంగా చౌడేపల్లెలో ఇళ్లు అద్దెకు తీసుకుని తన స్నేహితులతో కలిసి మార్బుల్ పనులు చేస్తున్నాడు. అతని గదిలోనే కర్ణాటకకు చెందిన అప్పి(35) అనే వ్యక్తి ఉంటున్నాడు. అతని వద్ద రమేష్ చేబదులుగా రూ.వెయ్యి తీసుకున్నాడు. తిరిగి ఆ డబ్బులు అప్పికి ఇవ్వలేదు. దీనిపై ఇద్దరు ఆదివారం ఉదయం గొడవపడ్డారు.
మాటామాటా పెరగడంతో అప్పి గదిలో ఉన్న కూరగాయలు తరిగే కత్తితో రమేష్‌పై దాడి చేసి గొంతుకోశాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని సహచరులు హుటా హుటిన కారులో స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి తిరుపతికి రెఫర్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.