నాగోలు: ప్రేమించిన యువతి మాట్లాడటం మానేసిందని... తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారాడు. ఆమెపై కక్షపెంచుకొని దాడి చేసేందుకు కత్తితో ఇంట్లోకి చొరపడ్డాడు. అడ్డువచ్చిన ఆమె తమ్ముడిని తొలుత పొడవడంతో అతను తీవ్ర గాయాలపాలై మృతి చెందగా అతని సోదరి స్వల్ప గాయాలపాలైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
టెన్త్ నుంచే ప్రేమలో...
ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్‌గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది.
షాద్‌నగర్ ప్రాంతంలోని షారుక్‌నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్‌మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్‌లోనే నివాసం ఉంటూ ఆర్టీస్ట్‌గా పనిచేస్తున్నాడు.
మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి..
సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్‌ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు.
దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు.
కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు.
నిందితుడిని పట్టుకున్న మహిళలు...
గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్‌రెడ్డి, ఇతర నేతలు ఘటనాస్థ్ధలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment