
సాలూరు: గాయాలపాలైన స్నేహితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన ఓ మహిళపై దాడి జరిగిన సంఘటన సాలూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు కిరణ్మయి, తండ్రి ఈశ్వరరావు, స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు... పట్టణంలోని చిట్లువీధిలో నివసిస్తున్న లలితకుమారి రామభద్రపురం మండలం తారాపురం యూపీ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తోంది.
ఆమెకు భర్త ప్రసాద్‌తో విభేదాలుండడంతో ఇరు కుటుంబాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇటీవల లలితకుమారిపై ప్రసాద్ దాడిచేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న కిరణ్మయి స్నేహితురాలిని పరామర్శించేందుకు సోమవారం లలితకుమారి ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో లలితకుమారి భర్త ప్రసాద్ రావడంతో అతనికి, కిరణ్మయికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో సహనం కోల్పోయిన ప్రసాద్ కిరణ్మయి పొట్టపై కత్తితో దాడి చేసాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన కిరణ్మయిని స్థానికులు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ఆస్పత్రికి రిఫర్ చేశారు. పట్టణ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment