హతుడి తల్లిదండ్రుల భావోద్వేగం
భర్త హత్య చేసిన కేసులో ప్రధాన ముద్దాయి భార్య
ఇతర ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా
సర్వకాల సర్వావస్థల యందు నీవెంటే నేనుంటానంటూ పెళ్లినాడు ప్రమాణం చేసి..భర్తతో ఏడడుగులు నడిచిన భార్యే..
భర్తను హత్య చేసిన కేసులో ప్రధాన ముద్దాయిగా తేలింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను పథకం ప్రకారం హత్య చేయించిన కేసులో ప్రధాన ముద్దాయితో పాటు మరో ఐదుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.
గురుగుబిల్లి/పార్వతీపురం టౌన్/వీరఘట్టం: ఉమ్మడి విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి జలాశయం సమీపంలో.. నాటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని చిట్టపులివలసకు చెందిన నవవరుడు యామక గౌరీశంకరరావు 2018 మే 7న హత్యకు గురైన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో విచారణ అనంతరం ప్రధాన ముద్దాయి అయిన భార్య సరస్వతితో పాటు ప్రియుడు శివ, మరో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1100 చొప్పున జరిమానా విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న హతుడు గౌరీశంకరరావు తల్లిదండ్రులు అప్పలనాయుడు, సింహాచలమమ్మలు తమ కుమారుడి ఆత్మకు ఇన్నాళ్లకు శాంతి కలిగిందని భావోద్వేగానికి గురవుతూ స్వగ్రామం చిట్టపులివలసలో కుమారుడి చిత్రపటం వద్ద నివాళులరి్పంచారు. ఏదిఏమైనప్పటికీ మా ఇంటి పెద్దదిక్కును కోల్పోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
కేసు పూర్వాపరాలు ఇలా..
అప్పటి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని చిట్టపులివలసకు చెందిన యామక అప్పలనాయుడు అదే మండలంలోని కడకెల్లకు చెందిన తన సోదరి గౌరమ్మ కూతురు సరస్వతిని చిన్నప్పటి నుంచి తానే పోషిస్తూ డిగ్రీ వరకు చదివించాడు. అనంతరం తన పెద్ద కుమారుడు గౌరీశం
కరరావుకు మేనకోడలు సరస్వతిని ఇచ్చి పెద్దల సమక్షంలో 2018 ఏప్రిల్ 28న పెళ్లి చేశాడు. బీటెక్ చదివిన గౌరీశంకరరావు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులోని పవర్ ప్లాంట్‌లో పని చేసేవాడు. డిగ్రీ తర్వాత బ్యాంకు టెస్టులు రాసేందుకు 2015లో సరస్వతి విశాఖపట్నంలో కోచింగ్ తీసుకోవడానికి వెళ్లింది.
ఆ సమయంలో అక్కడ నర్సీపట్నానికి చెందిన శివ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తరచూ ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతున్న సరస్వతి.. బావతో 2018 ఏప్రిల్ 28న తన పెళ్లి చేశారని, ఆ పెళ్లి ఇష్టం లేదని వాపోతూ భర్తను ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి పెళ్లయిన నాటి నుంచే పథకం పన్నింది. దీంతో శివ.. తన ప్రియురాలి భర్తను హతమార్చేందుకు విశాఖకు చెందిన రౌడీషీటర్ గోపీతో రూ.10 వేల నగదు, 10 తులాల బంగారం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ నేపథ్యంలో పథకం ప్రకారం 2018 మే 7న తోటపల్లి జలాశయం సమీపంలోని ఐటీడీఏ పార్కు వద్ద భర్త గౌరీ శంకరరావును ప్రియుడి సాయంతో సరస్వతి హతమార్చి దుండగుల దాడిగా చిత్రీకరించింది. అయితే పోలీసుల దర్యాప్తులో ఈ హత్య ఘటనలో ప్రధాన నిందితురాలు భార్యేనని తేలడంతో ఆమెతో పాటు ప్రియుడు శివ, మరో నలుగురు దుండగులపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపట్టారు. అప్పటినుంచి ఆరేళ్లుగా కోర్టులో నడుస్తున్న ఈ కేసు విచారణ పూర్తి కావడంతో న్యాయమూర్తి బుధవారం తుదితీర్పు చెప్పారు. ఈ కేసులో ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గొర్లి వెంకటరావు, బడే వెంకట నాయుడు వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment