విజయవాడ : పెట్రోలు, డీజిల్ ధరల పెంపు కారణంగా చెలరేగిన మంటలు జిల్లాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పేరుతో దొంగదెబ్బ తీసిందని వినియోగదారులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమానికి సద్ధమయ్యాయి. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ విధించడం వల్ల ప్రత్యక్షంగా వాహన యజమానులపై, పరోక్షంగా సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో దాదాపు 10 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటిలో 70శాతం మధ్య తరగతి ప్రజలు వినియోగించే ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.
జిల్లాలో ఐవోసీ, హెచ్‌పీ, బీపీసీకి చెందిన 220 బంకులు నడుస్తున్నాయి. ఈ బంకుల్లో సగటున రోజుకు 2.20లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ విక్రయిస్తున్నారు. వ్యాట్ పేరుతో శుక్రవారం నుంచి లీటరు పెట్రోలుపై రూ.4.04, డీజిల్‌పై రూ.4.03 పైగా పెంచడంతో మోటారు వాహనాల యజమానులపై రోజుకు రూ.8.80లక్షలు, నెలకు రూ.2.64కోట్ల అదనపు భారం పడుతుంది. బైక్ వినియోగించేవారిపై సగటున రోజుకు రూ.8, కార్లు వినియోగించేవారిపై రూ.80 చొప్పున అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రజలపై పరోక్షంగా భారం
ఇంధన ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై కూడా పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. రవాణా వ్యవస్థపై భారం పడుతుంది. లారీలు, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు కిరాయిలు పెంచే ప్రమాదం ఉంది. దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టీసీకి అదనపు భారంగా మారింది. జిల్లాలోని 900 ఆర్టీసీ బస్సులకు రోజూ 90వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తుంటారు. లీటరకు రూ.4.03 చొప్పున పెరగడంతో రోజుకు రూ.3.60లక్షలకు పైగా భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వ్యాట్ పెంపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని పెట్రోల్ బంకుల యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముందుగానే స్టాక్ ఉన్నందున దానికి తాము టాక్స్ చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు.
ప్రజలపై భారం పడుతుంది
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ధర పెంచుతోంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పేరుతో రూ.4కు పైగా పెంచింది. ఆదాయం కోసమే ప్రభుత్వం వ్యాట్ విధించింది. ఈ భారం పేద, మధ్య తరగతి వర్గాలపై పడుతుంది. మన రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాల్లో ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. లారీలు, కార్లు ఇతర దూర ప్రాంతాలు వెళ్తాయి కాబట్టి అక్కడ ఆయిల్ కొనుగోలు చేస్తారు. మన రాష్ట్రంలో అమ్మకాలు తగ్గుతాయి. దీనిపై మంత్రులకు లేఖ రాశాం.
- వైవీ ఈశ్వర్,
జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్
చమురు మంటలు
Published Sat, Feb 7 2015 1:08 AM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM
Advertisement