కర్నూలు : నెల రోజుల వ్యవధిలోనే పెట్రో బాంబు రెండోసారి పేలింది. నిన్నటి వరకు పెట్రోలు లీటరు ధర రూ. 66.33లు ఉండగా.. తాజాగా పెరిగిన ధరతో లీటరు పెట్రోలు రూ. 69.79కి చేరింది. అదేవిధంగా ప్రస్తుతం లీటరు డీజిల్ ధర రూ. 54.92లు ఉండగా.. స్థానిక పన్నులతో కలిపి రూ. 3.34లు పెరిగింది. ఈ లెక్కన ప్రస్తుతం లీటరు ధర రూ. 58.26లకు చేరింది. శనివారం అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో డీజిల్, పెట్రో ధరలు పెరగడం గమనార్హం.
రోజకు పెట్రో భారం రూ. 28.60 లక్షలు
జిల్లాలో రోజుకు 6,66,666 లీటర్లకుపైగా డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే నెలకు 2 కోట్ల లీటర్ల వినియోగం ఉంటుంది. తాజాగా డీజిల్‌పై లీటరుకు రూ. 3.34లు(స్థానిక పన్నులతో కలిపి) అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోపింది. ఈ లెక్కన డీజిల్‌పై రోజుకు రూ.22.26 లక్షల చొప్పున నెలకు రూ. 7.56 కోట్లు ప్రజలపై అదనపు భారం పడుతుంది. అలాగే పెట్రోలు ధర కూడా లీటరుపై రూ. 3.46లు పెరిగింది. జిల్లావ్యాప్తంగా పెట్రోలు వినియోగించే వాహనాలు 5 లక్షలకుపైగా ఉన్నాయి. ఈ వాహనాలకు రోజుకి 1,83,333 లీటర్ల పెట్రోలును వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రోజుకి భారం రూ. 6.34 లక్షల అవుతోంది. నెలకు రూ. 2.13 కోట్లు అదనపు భారం పడుతోంది.
నిత్యావసర సరుకులపై ప్రభావం..
డీజిల్ ధర భారీగా పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం చూపనుంది. సరుకు రవాణాకు డీజిల్ వాహనాలనే వినియోగిస్తారు. నిత్యావసర సరుకులతోపాటు పాలు, కూరగాయలు, పండ్లు ఈ వాహనాల్లోనే రవాణా చేస్తుంటారు. డీజిల్ ధర పెరిగిన నేపథ్యంలో వీటి రవాణాకు అయ్యే వ్యయం కూడా పెరగనుంది. ఫలితంగా కూరగాయలు, పండ్లు, పాలు ఇతర నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఆర్టీసీపై భారం..
రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఆర్టీసీ)పై డీజిల్ భారం పడింది. పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్న సంస్థకు పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా మరింత నష్టాల్లోకి వెళ్లనుందని చెప్పవచ్చు. ఈ నెల ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సుల రూపంలో రూ.4 పెంచిన విషయం తెలిసిందే. నెల రోజులు గడవక ముందే ఇప్పుడు మరోసారి పెంచింది. కర్నూలు రీజియన్ (జిల్లా)లోని 11 డిపోల్లోని 1016 బస్సుల్లో 181 అద్దె, 835 సంస్థ బస్సులున్నాయి. అద్దె బస్సులు మినహా సంస్థ బస్సుల నిర్వహణ, డీజిల్ కొనుగోలు అంతా ఆర్టీసీదే. ఇవి రోజుకు దాదాపు 3.70 లక్షల కిలో మీటర్లు తిరిగి 3.90 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. వీటికి రోజుకు 76,144 లీటర్ల వరకు డీజిల్ అవసరం. పెరిగిన ధరతో రోజుకు రూ. 2.54 లక్షలకు పైగా అదనపు భారం పడగా నెలకు రూ.76.29 లక్షలు అవుతుంది. ఈక్రమంలో ఏడాదికి 2.78 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తుండడంతో సంస్థపై రూ. 9.15 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఈ భారాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టామని డిప్యూటి చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాసులు పేర్కొన్నారు.
‘పెట్రో’ బాదుడు
Published Sun, Mar 1 2015 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement
Advertisement