(ఉద్దానం నుంచి సాక్షి బృందం): పై-లీన్ తుపాను బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కకావికలమైంది. శనివారం రాత్రి వీచిన ప్రచండ గాలులకు ఒకరు మృతి చెందారు. సుమారు రూ.1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఉద్యాన పంటలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. మిగతా పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. 200 విద్యుత్ ఫీడర్లు, 16 సబ్ స్టేషన్లు పాడయ్యాయి. చెరువులు, రోడ్లు, భవనాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. 87 పశువులు మృత్యువాత పడ్డాయి. మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పడవలు, వలలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ నష్టం రూ.6 కోట్ల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా.
ఉద్దానం ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 233 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. 1999లో విరుచుకుపడిన సూపర్ సైక్లోన్ రోజును మళ్లీ గుర్తు చేశాయి. అప్పుడు కూడా దసరాకు ముందే భీకర గాలులు వీచాయి. ఆ నష్టం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రైతులకు తాజా తుపాను శరాఘాతమైంది. కొబ్బరి సుమారు 16,325 ఎకరాలు, మామిడి 1,000 ఎకరాలు, అరటి 500 ఎకరాలు, మునగ 100 ఎకరాల మేర దెబ్బతిన్నాయి. 29 వేల ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. 5,141 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఆరు మండలాల్లో సుమారు వంద ఇళ్లు కూలిపోయాయి. మరో 50 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్డుపై చెట్లు పడిపోవడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మత్స్యకార గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉంది. అలల తాకిడికి, వరద ఉధృతికి రోడ్లు దాదాపు దెబ్బతిన్నాయి. వందల సంఖ్యలో వలలు, పదుల సంఖ్యలో పడవలు కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి.
కాగా, తుపాను నేపథ్యంలో శ్రీకాకుళంలోని పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వారి అవసరాలను పట్టించుకునే వారే కరవయ్యారు. తుపాన్ తీరం దాటాక బాధిత గ్రామాలకు అధికారులు వెళ్లడంలో శ్రద్ధ చూపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 52 పునరావాస కేంద్రాల్లో దాదాపు 61 వేల మందికి ఆశ్రయం కల్పించారు. చాలా మందికి సరిగా భోజనం అందలేదు. కొన్నిచోట్ల మంచినీళ్లతోనే సరిపెట్టేశారు. తమను పట్టించుకునే వారే కన్పించలేదని బారువ శివారు గ్రామాలైన కొత్తూరు, వాడపాలెం మత్స్యకారులు వాపోయారు.
నష్టపోయిన గ్రామాల పరిస్థితేంటో ఆరా తీసే ప్రయత్నం జరగలేదు. అధికార యంత్రాంగం కార్యాలయాల్లోనే ఉండి నష్టం అంచనాలు వేస్తున్నారు. జాతీయ విపత్తు నివారణ బృందాలే కొన్ని గ్రామాల్లో సహాయ చర్యలు చేపడుతున్నాయి.
మొత్తం 9 బృందాలు స్థానిక పోలీసులు, రెవెన్యూ విభాగాల సహకారంతో సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ ఆపరేషన్ పూర్తయ్యేంత వరకూ తమ సిబ్బంది ఇక్కడే ఉంటారని అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణకుమార్ ‘సాక్షి’కి చెప్పారు.
కాగా, ఇచ్ఛాపురం మండలంలోని మండపల్లి, మశాకపురం, తేలుకుంచి, కొళిగాం, పాయితారి, కీర్తిపురం, రత్తకన్న, డొంకూరు, పెదలక్ష్మీపురం గ్రామాలను వరద నీరు భయపెడుతోంది. ఈ గ్రామాలకు వెళ్లాలంటే అటు భీమ సముద్రం ఇటు బహుదానది మధ్య ఉండే ఒకే ఒక రోడ్డు వరద నీటిలో చిక్కుకుంది. మరోపక్క విజయనగరం జిల్లాలోని సీతానగరం, బలిజిపేట, మక్కువ, సాలూరు మండలాల్లో వందలాది ఎకరాల్లో పంట నాశనమైంది. మొక్కజొన్న, అరటి, చెరుకు పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చెట్లు విరిగి రాకపోకలకు ఇబ్బంది కలిగింది.