ఉగాది సంబరాలు ఉప్పొంగుతున్న వేళ.. కుటుంబ రావు ఆసక్తిగా టీవీలో పంచాంగశ్రవణం కార్యక్రమాన్ని తిలకిస్తున్న సమయమది.. అలా చూస్తూ ఉంటే ఎప్పుడు పట్టేసిందో మాగన్నుగా నిద్ర పట్టేసింది. ఆ స్వప్నంలో పంచాంగ శ్రవణం జోరుగా సాగుతోంది. పంచాంగం పఠనం చేస్తున్నదెవరా? అని తేరిపార చూస్తే.. అది కుటుంబరావే. ఎదురుగా బోలెడు మంది రాజకీయ నాయకులు కూర్చున్నారు. అందరినీ చూస్తూ శాస్త్రి గొంతు సవరించుకున్నాడు. ‘చూడండి నాయనా ఈ రోజు ఉగాది. ఈ కొత్త సంవత్సరంలో ఓ ప్రత్యేకత ఉంది. అయిదేళ్లు మన భావి విధాతలెవరో, నిర్ణేతలెవరో ఇప్పుడే తెలుస్తుంది. అందుకని అటువంటి వారు ఈ పీఠం దగ్గర కొస్తే, రాశిఫలం, భవితవ్యం నేను చెబుతాను.’ అన్నాడు దుడ్డు కర్రను అటూ ఇటూ ఊపుతూ... దాంతో అంతా కలిసి ఒకాయన్ను ముందుకు నెట్టేశారు.
శాస్త్రీ.. జర జాగ్రత్త.. నా రాశి ఫలం పద్ధతిగా చూడు. భజన, విభజన నన్నిలా చేశాయి కానీ నేను శానా గొప్పోణ్ని. మాయమ్మ పెద్దమ్మ.. ఆళ్ల ఆయన గారి వంశం శానా గొప్పది. మా పెద్దమ్మ స్టాండంటే మేమంతా స్టాండు.. సిట్టంటే సిట్టు. ఇక్కడున్న శానా మంది మావోళ్లే. ఈ మధ్య మా ఇల్లు గుల్లయింది. ఈల్లంతా తలా ఓదారి పట్టేశారు. నా బతుకే ఏటవుద్దోనని బెంగగా ఉంది. నా పేరు పితలాటకం... అన్నాడు. శాస్త్రి గొంతు సవరించుకు న్నాడు. నాయనా... పేరును బట్టి చూస్తే నీది తులా రాశి, అంటే కప్పల తక్కెడ మేళమన్నమాట.
అందుకే మీ పరిస్థితి ఇలా అఘోరిస్తోంది. మీకు ఆదాయం సున్నా.. వ్యయం ఇప్పుడు చాలా ఉన్నా.. తర్వాత సున్నా. రాజపూజ్యం సున్నా... అవమానం ఎంతో చెప్పడానికి లెక్కలు చాలడంలేదు. మీ భస్మాసుర హస్తం అంటే జనాలు మండి పడుతున్నారని గ్రహస్థితిని బట్టి తెలుస్తోంది. రోజూ పదివేల సార్లు తూర్పుకు తిరిగి ఇటలీ వైపు దండం పెట్టు. ప్రజలకు బదులు ఇదిగో ఇదే నేనిచ్చే వడ్డింపు’ అంటూ దుడ్డు కర్రతో చెడామడా వేశాడు. పితలాటకం కుయ్యో మొర్రో అంటూ పారిపోయాడు.
పచ్చచొక్కాయన పడుతూ లేస్తూ ముందుకొచ్చాడు. అడగకముందే, ‘నా పేరు ిపీతాంబరం.. అ పక్కన చూశారా.. ఆహా ఓహో బృందం. ఆళ్లు పక్క వాయిద్యగాళ్లు. ఆ భజన లేకుంటే నాకు క్షణం తోచదు. ఈ సన్నాయి మేళం లేకపోతే శానా నీరసం వచ్చేస్తుంది. ఆటేపు కూసున్నోడు నిత్యం బుడగ మాదిరి నాకు గాలి ఊదుతూ ఉంటాడు. నేను ‘పేపర్’ టైగర్ని. పెజాగర్జన చేసేననుకో.. ఊరూరూ హడలిపోవాల్సిందే.’ అని పిల్లిలా గర్జించేడు. కుటుంబశాస్త్రి అదేం పట్టించు కోకుండా ‘నాయనా, నీ పేపర్ పులి బలం తెలియ నిదెవరికి? నీ పేరును బట్టి నీది వృశ్చిక రాశి. జాలి పడితే చిటికెలో వెనకనుంచి కుట్టే ప్రవృత్తి నీది. మీ పచ్చధనంతో జ నం కళ్లు బైర్లు కమ్మా యి. అందుకే జనం ఎప్పుడో తరిమే శారు. ఈసారీ భజన తప్పదని మీ వృశ్చికత్రయం రాశి ఫలాలను బట్టి తెలుస్తోంది. ఇక నీకు రాజ గురువు పూ జ్యం చాలా ఉంది కానీ రాజపూజ్యం శూన్యం. ప్రజల్లో అవమా నం దండిగా దొరికేట్టు స్పష్టంగా ఉందంటూ నాలుగు వడ్డించాడు.
జైజై.. అని బిగ్గరగా, సమైక్యాంధ్ర అని అస్పష్టంగా అంటూ ఆకుపచ్చ చొక్కాయన ముందుకొచ్చాడు. ‘బాలేస్తా, బ్యాట్ తీస్తా.. ఆఖరి బంతీ నాదే.. ఆఖరి రన్నూ నాదే’ అని అర్ధం లేని క్రికెట్ భాషలో మాట్లాడు తూ గిరికీలు కొట్టడం మొదలెట్టాడు. శాస్త్రి ఇదేం పట్టించుకోకుండా.. ‘అనుకోకుండా బ్యాటింగ్‌కు వచ్చి, ఆట మర్చిపోయిన బ్యాట్స్‌మన్‌వు నువ్వు. నీది కిరికిరికెట్టు. ఇప్పుడు నీ ఆట తీసికట్టు. ఓట్లాటలో నువ్వో అనామకుడివి. మత్స్యరాశి నీది. అంటే చేపలా జారి పోతావ్. నీకు సిక్సే బెస్టు.. అని దుడ్డుకర్రతో లాగిపెట్టి ఒక్కటిచ్చుకున్నాడు.
ఇంతలో.. ద్వారం దగ్గర ఏదో కలకలం. కూర్చున్న వారిలో కోలాహలం. చూసేసరికల్లా దూరం నుంచి నడిచి వస్తూ ఓ స్ఫురద్రూపి. చూస్తే నిటారుగా ఉన్న యువకుడు. ‘శాస్త్రిగారూ.. నాది మడమ తిప్పని నైజం. నిజాయితీ నా శక్తి. పది మందికీ మేలు చేయాలన్న పెద్దాయన ఆశయబలం నాది. కష్టాల్లో ఉన్న వాడికి ఓదార్చి తోడ్పాటు అందించే హృదయం ఉంది. కుటుంబ శాస్త్రి బదులిస్తూ ‘నాయనా, నీ తండ్రి పుణ్యాన సకల రాశుల శోభ నీకు దక్కుతుంది. నువ్వు ఎక్కుపెట్టిన అస్త్రం లక్ష్యం చేరుతుంది. ప్రజల దీవెన నీకు దక్కుతుంది. విజయీభవ’ అని ఓటింగ్ యంత్రం ఇచ్చి దీవించాడు. జనం కేరింతలు కొట్టారు.. ఆ కోలాహలానికో, టీవీలో ప్రకటనల హోరుకో.. కుటుంబ శాస్త్రికి.. కాదుకాదు.. కుటుంబరావుకు ఒక్క ఉదుటున తెలివొచ్చింది. కలయా.. నిజమా! అన్న పాట పెదవులపై అసంకల్పంగా కదిలింది.
ఫన్‌చాంగ శ్రవణం
Published Mon, Mar 31 2014 1:22 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement