వైద్యురాలి నిర్లక్ష్యంతో శిశువు మృతి | Physician negligence baby died | Sakshi
Sakshi News home page

వైద్యురాలి నిర్లక్ష్యంతో శిశువు మృతి

Published Mon, Nov 10 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

వైద్యురాలి నిర్లక్ష్యంతో శిశువు మృతి

వైద్యురాలి నిర్లక్ష్యంతో శిశువు మృతి

 భీమవరం అర్బన్ : వైద్యురాలు నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత బంధువులు భీమవరంలో ప్రభుత్వాసుపత్రి వద్ద ఆదివారం ఆందోళనకు దిగారు. శిశువు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన డాక్టర్ పట్టించుకోకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన పాస్టర్ వానపల్లి పౌలురాజు కుమారుడు సత్యం భార్య లిఖితను రెండో కాన్పు నిమిత్తం ఈనెల 6న భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రసవంలో ఆమెకు కుమార్తె జన్మించింది.
 
 అయితే ఆరోజు ప్రసవం చేయడంలో వైద్యురాలు నవీన నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అరోజు ఉదయం 10 గంటలకు నొప్పులు వస్తే సాయంత్రం 6 గంటలకు ఆపరేషన్ చేశారని శిశువు తండ్రి సత్యం ఆరోపించాడు. అప్పటి నుంచి శిశువును ఏ డాక్టర్ వచ్చి పరీక్షించలేదని తెలిపాడు. అసలు ఆసుపత్రిలో పిల్లల వైద్యుడు ఉన్నాడనే విషయాన్ని వారు చెప్పలేదన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో శిశువు ముక్కు నుంచి రక్తం రావడంతో కంగారు పడి నర్సులకు తెలియజేయగా, వారు పరీక్షించి ఆక్సిజన్ పెట్టారన్నారు. అయితే శిశువులో ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారన్నారు. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి శిశువును తీసుకెళ్లగా, అప్పటికే శిశువు మృతి చెందిందని, నాలుగు గంటల ముందు తీసుకొచ్చి ఉంటే బతికేదని అక్కడి వైద్యులు చెప్పారు.
 
 దీంతో ప్రభుత్వాసుపత్రికి వచ్చి డాక్టర్ నవీనను తమ శిశువు మరణించిందని, దీనికి సమాధానం చెప్పమని నిలదీశారు. అయితే దీనికి ఆమె ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ వస్తారని, ఆయన్ను అడగాలంటూ నిర్లక్ష్యంగా వెళ్లిపోయారన్నారు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమేకాక, బాధితులకు సరైన సమాధానం కూడా చెప్పని వైద్యురాలి తీరును నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యురాలు వచ్చి సమాధానం చెప్పాలని భీష్మించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం ఆస్పత్రికి చేరుకుని వైద్యురాలిని నిలదీశారు. శిశువుకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం తగదన్నారు. దీంతో వైద్యురాలు పాస్టర్ పౌల్‌రాజు, శిశువు తండ్రి సత్యానికి క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement