
పిడుగుపడి రైతు మృతి
మండలంలోని టి.తుమ్మలపల్లె గ్రామానికి చెందిన బండి కృష్ణారెడ్డి(43) అనే రైతు పిడుగుపడి శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
తొండూరు: మండలంలోని టి.తుమ్మలపల్లె గ్రామానికి చెందిన బండి కృష్ణారెడ్డి(43) అనే రైతు పిడుగుపడి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. బంధువుల కథనం మేర కు.. కృష్ణారెడ్డి తన పొలంలో రబీలో బుడ్డ శనగ పంటను సాగు చేశాడు. శుక్రవారం సాయంత్రం పొలంలో కలుపు ను తొలగిస్తుండగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో రైతుపై పిడుగు పడటంతో పొలంలోనే కుప్పకూలి మృతి చెందాడు.
రాత్రి 8గంటలైనా కృ ష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో భార్య రమణమ్మ, బంధువులతో కలిసి పొలం వద్దకు వెళ్లగా అప్పటికే అతను పొలంలో మృతి చెంది ఉన్నాడు. మృతునికి భార్య రమణమ్మతోపాటు పిల్లలు శ్రీలత, శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. రైతు మృతితో టి.తుమ్మలపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రబీలో సాగు చేసిన పంటలు చేతికందగానే బిడ్డ పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ పంట పండక ముందే మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
కృష్ణారెడ్డికి నివాళులర్పించిన
వైఎస్సార్‌సీపీ నాయకులు : టి.తుమ్మలపల్లె గ్రామానికి చెందిన బండి కృష్ణారెడ్డి అనే రైతు పిడుగుపాటుతో మృతి చెందాడనే విషయం తెలుసుకున్న మండల వైఎస్సార్‌సీపీ నాయకులు శనివారం పులివెందుల ఆసుపత్రికి వెళ్లి నివాళులర్పించారు. వీరిలో వైఎస్సార్‌సీపీ మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రగంగిరెడ్డి, ఎంపీపీ భర్త రవీంద్రనాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండి రమణారెడ్డి, సర్పంచ్ చిన్న గంగిరెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ వెంకటరామిరెడ్డి, సైదాపురం మాజీ సర్పంచ్ సురేష్‌రెడ్డి తదితర నాయకులు ఉన్నారు.