దారుణం: మహిళను ఈడ్చుకెళ్లిన పందులు
దారుణం: మహిళను ఈడ్చుకెళ్లిన పందులు
Published Sat, Aug 19 2017 2:03 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
కావలి: నెల్లూరు జిల్లా కావలిలో దారుణం జరిగింది. పట్టణంలో ఓ మహిళపై పందులు దాడి చేసి కింద పడేసి కొరికేశాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. రోడ్డుపై వెళుతున్న కొందరు ఈ ఘటన చూసి షాక్ అయ్యారు. స్థానికులు ఎంత తరిమినా పందులు బెదరలేదు. దీంతో రాళ్లతో కొట్టి ఆ మహిళను రక్షించారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని వైకుంఠపురం ప్రాంతానికి చెందిన షేక్ బీబీజాన్ అనే మహిళ ఇళ్లల్లో పనులు చేసుకుని జీవిస్తోంది. శుక్రవారం ఉదయం అయ్యప్పస్వామి గుడి పక్క వీధిలో నడిచి వెళ్తుండగా ఓ పందుల గుంపు ఆమెపై దాడి చేసింది.
రెండు పందులు ఆమెను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాయి. స్థానికులు గుర్తించి అతికష్టం మీద పందులను తరిమి వేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను 108 వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. పందుల దాడిలో బీబీజాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. పందులు ఈ విధంగా దాడి చేయటం చిత్రంగా ఉందని.. ఎప్పుడూ ఇలాంటి ఘటన చూడలేదని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పందులు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదంటున్నారు.
Advertisement
Advertisement