నగరపాలక సంస్థలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) అధికారులు, పాలకులకు బీపీ పెంచుతోంది.
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) అధికారులు, పాలకులకు బీపీ పెంచుతోంది. ఈ ప్రక్రియ మూడడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కు చందంగా నడుస్తోంది. స్కీమ్‌కు ఈ నెల 31తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు 5,899 దరఖాస్తులు అందాయి. బీపీఎస్‌కు సుమారు 15 వేల దరఖాస్తులు వస్తే రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు, పాలకులు కలలు కన్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే అందులో మూడో వంతు ఆదాయం కూడా వచ్చేలా కనిపించడం లేదని పెదవి విరుస్తున్నారు. నగరపాలక సంస్థలు, మునిసిపాల్టీల్లో భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. మే 27 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఇప్పటికి మూడుసార్లు గడువు పొడిగించారు. తొలి గడువు ఆగస్ట్ 31 వరకు 4,150 దరఖాస్తులు అందాయి. సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు 1,749 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
క్లియరెన్స్ ఏదీ?
ఇప్పటివరకు అందిన బీపీఎస్ దరఖాస్తుల్ని క్లియర్ చేయడంలోనూ టౌన్‌ప్లానింగ్ అధికారులు విఫలమయ్యారు. నవంబర్ 20వ తేదీ నుంచి క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. నవంబర్ 16న గుంటూరు, 17న విశాఖపట్నం, 18న అనంతపురం రీజియన్లలో ఎంపికచేసిన టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆన్‌లైన్ విధానంలో బీపీఎస్ చేసేందుకు ట్యాబ్‌లు కొనుగోలు చేసుకోవాల్సిందిగా డీటీసీపీ ఆదేశాలు జారీచేశారు. గ్రేటర్ విశాఖ, గుంటూరు నగరపాలకసంస్థల్లో క్రమబద్ధీకరణ ప్రారంభం కాగా విజయవాడలో అడుగు ముందుకు పడలేదు. ట్యాబ్‌లు కొనుగోలు చేయకపోవడమే ఇందుకు కారణమని టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసేందుకు గృహనిర్మాణదారులు ఆసక్తి కనబరచడం లేదు.
అమలుకాని ఆదేశాలు
ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో అధికారుల్లో హైరానా మొదలైంది. బీపీఎస్‌కు 2008లో 15,826 దరఖాస్తులు రాగా 11,287 క్లియర్ చేశారు. టౌన్‌ప్లానింగ్ ద్వారా ఏడాదికి 2,500 గృహ నిర్మాణ ప్లాన్లు మంజూరు చేస్తారు. ఈ లెక్కన సుమారు 15 వేల దరఖాస్తులు వస్తాయని లెక్కలేశారు. 2007 నుంచి ఇప్పటివరకు మంజూరు చేసిన బిల్డింగ్ ప్లాన్ల ఆధారంగా స్పెషల్ డ్రైవ్‌ను ముమ్మరం చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. డీవియేషన్లు ఉన్న గృహాలకు బీపీఎస్ అని రాసి ఇంటూ మార్క్ వేయాల్సిందిగా పేర్కొన్నారు. ఇదంతా మొక్కుబడి తంతుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది సైతం సమగ్ర సర్వే విధులకు హాజరుకావడంతో బీపీఎస్ అటకెక్కిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇబ్బందులు తప్పవు
క్రమబద్ధీకరణకు ముందుకు రాకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. అక్రమ నిర్మాణాలకు నూరుశాతం ఆస్తిపన్ను పెంచుతాం. డీవియేషన్ స్థాయిని బట్టి భవనాలను కూల్చివేయడానికి కూడా వెనుకాడేది లేదు. నగరంలో బీపీఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తాం.
-జి.వి.రఘు,
టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డెరైక్టర్