సాక్షి, న్యూఢిల్లీ/ఒంగోలు సిటీ/పట్నంబజారు(గుంటూరు): కృష్ణాపురం (కేపీ) రకం ఉల్లిపాయల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఒకటి, రెండు రోజుల్లో తొలగిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్, కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాల్లో రైతులు కేపీ రకం ఉల్లిపాయలను దాదాపు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో పండిస్తున్నారు. హాంకాంగ్, మలేసియా, సింగపూర్ తదితర దేశాలు కేపీ ఉల్లిని దిగుమతి చేసుకుంటాయి. దురదృష్టవశాత్తు గత ఏడాది సెప్టెంబర్‌లో కేపీ రకం ఉల్లితో సహా ఉల్లిపాయల ఎగుమతులను ప్రభుత్వం నిషేధించడం వల్ల కేపీ ఉల్లి సాగుచేస్తున్న వేలాది మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
రైతులు ఈ రకం ఉల్లిని దేశీయ మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి. కేపీ ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి పనికి రాదు. అందువల్ల చేతికొచ్చిన పంట కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. కేపీ ఉల్లి పండించే రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రోజ్ ఆనియన్ పేరుతో ఇదే రకం ఉల్లిని కర్ణాటక రైతులు సాగుచేస్తున్నారు. ఆ ఉల్లిని ఎగుమతి చేయడానికి అనుమతించిన కేంద్రం కేపీ ఉల్లి ఎగుమతులకు మాత్రం అనుమతించకపోవడం న్యాయం కాదు. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తక్షణమే తొలగించాలి..’ అని వాణిజ్య శాఖ మంత్రి గోయల్‌ను అభ్యర్థించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇది చాలా ప్రధానమైన సమస్య అని అంగీకరించారు. ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటుందని సభా ముఖంగా హామీ ఇచ్చారు.
ఉద్దానం కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇవ్వలేం: కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బారినపడి డయాలసిస్ చేయించుకుంటున్న నిరుపేదలకు ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే అవకాశం లేదని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. అలాంటి పేషెంట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నెలకు రూ. 10 వేల చొప్పున పెన్షన్ చెల్లిస్తున్నట్లుగా తమకు సమాచారం ఉందని అన్నారు. వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. నిరుపేదలైన దీర్ఘకాలిక కిడ్నీ రోగులకు ప్రతి జిల్లా ఆస్పత్రిలో ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమాన్ని 13 జిల్లాల్లో 35 కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నట్లు చెప్పారు. వి.విజయసాయిరెడ్డి అనుబంధ ప్రశ్న అడుగుతూ.. ‘ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ పరిశోధనా కేంద్రంతోపాటు 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఆరోగ్య మంత్రికి తెలుసు. కాబట్టి ఉద్దానం ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్యాకేజీతోపాటు పలాసలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టే అంశాన్ని కేంద్రం పరిశీలించాలి..’ అని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
రూ. 2,527 కోట్ల మేర జీఎస్టీ ఎగవేత
జూలైలో జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 2019 వరకు వ్యాపారుల నుంచి వినియోగదారులకు జరిగిన సరఫరాల్లో రూ. 2,527 కోట్ల మేర పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. రాజ్యసభలో వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.
ఎంపీ గల్లా నేరప్రవృత్తి ఉన్న ముఠాతో వచ్చారు
తన మానవ హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని, తన ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లిందంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు నేర ప్రవృత్తి ఉన్న ముఠాతో పాటు గల్లా జయదేవ్ అసెంబ్లీ ప్రాంతానికి వచ్చారని ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ గల్లా జయదేవ్ అసెంబ్లీ ఏరియాలోకి వెళ్లాలని భావించడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుందన్నారు. అసెంబ్లీ సభ్యుల భద్రత కోసం మాత్రమే పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అంతకుముందు గల్లా జయదేవ్ మాట్లాడుతూ తన మానవ హక్కులకు, ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లిందన్నారు. జనవరి 20న అసెంబ్లీ జరుగుతున్న వేళ అమరావతి జేఏసీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిందని, తన నియోజకవర్గ పరిధిలో ఉన్నందున వారికి మద్దతుగా తాను అందులో పాల్గొన్నానని చెప్పారు. అసెంబ్లీకి వెళ్లేసరికి పోలీసులు తమపై లాఠీచార్జ్ చేసి గాయపరిచారన్నారు.
బాధ్యత పట్టని కంపెనీలపై తీసుకుంటున్న చర్యలేంటి?
దేశంలోని వివిధ కంపెనీలు సామాజిక బాధ్యత కింద (సీఎస్‌ఆర్) చేసుకున్న ఒప్పందాల ప్రకారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల వినియోగం, ప్రభుత్వ పర్యవేక్షణ, పథకాల కేటాయింపు, వాటి అతిక్రమణలపై తీసుకుంటున్న చర్యల గురించి మాగుంట శ్రీనివాసులురెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిస్తూ.. ఈ పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాలకు దేశంలోని కంపెనీలు 2015–16లో రూ.14,517 కోట్లు, 2016–17లో రూ.14,329 కోట్లు, 2017–18లో రూ.13,620 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఏపీలో 2015–16లో రూ.1,294 కోట్లు, 2016–17లో రూ.753 కోట్లు, 2017–18లో రూ.269 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సీఎస్‌ఆర్ కమిటీ సిఫార్సులను అనుసరించి అన్ని విషయాలనూ బోర్డు చూసుకుంటుందని వివరించారు.
జాతీయ ఆయుష్ మిషన్ కింద ఏపీకి రూ.19 కోట్లు
జాతీయ ఆయుష్ మిషన్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కి రూ.19.01 కోట్లు ఆర్థిక సహాయంగా అందించినట్లు ఆయుష్ శాఖల మంత్రి శ్ర్రీపాద యశోనాయక్ చెప్పారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఆయుష్ మిషన్ కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రూ. 363.73 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
పురుగు మందుల వాడకం పరిమిత స్థాయిలోనే ఉంది
వ్యవసాయ రంగంలో రసాయనాల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతోంది?, ఆంధ్రప్రదేశ్‌లో పరిమితికి మించి పురుగుమందుల వాడకం ఉందా? అంటూ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ బదులిస్తూ.. రసాయనాల వాడకం పరిమిత స్థాయిలోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వ్యవసాయ రంగంలో రసాయన, పురుగు మందుల వాడకంపై పలు ప్రశ్నలు అడిగారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చింది.
ఏపీలో నాలుగు నగరాల్లో 266 విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లు
ఫేమ్ ఇండియా పథకం రెండో దశ కింద ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు 92, విశాఖపట్నానికి 71, తిరుపతికి 68, కాకినాడకు 35 చొప్పున విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 62 నగరాల్లో 2,636 విద్యుత్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. ఎంపీ రఘురామకృష్ణ్ణంరాజు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, మిథున్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్ అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి 106 ప్రతిపాదనలు అందినట్లు చెప్పారు.
893 మెట్రిక్ టన్నుల విదేశీ ఉల్లి
కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను వివిధ రాష్ట్రాలకు మార్కెట్ రేట్ల ప్రకారం సరఫరా చేస్తోందని వినిమయ వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి దాన్వే రావ్‌సాహెబ్ దాదారావు లోక్‌సభకు తెలిపారు. ఈ ఏడాది జనవరి చివరినాటికి ఆంధ్రప్రదేశ్‌కు 893.18 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు111.68 మెట్రిక్ టన్నుల ఉల్లిని అందజేసినట్లు ఆయన చెప్పారు. లోక్‌సభలో ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, కోటగిరి శ్రీధర్, రెడ్డప్ప, ఆదాల అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. జనవరి చివరినాటికి కేంద్రం 2,600 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రాష్ట్రాలకు అందించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment