
న్యూఢిల్లీ : కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యలను వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం రాజ్యసభలో ప్రస్తావించారు. జీరో అవర్‌లో రైతు సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశాల్లో కేపీ ఉల్లికి మంచి గిరాకీ ఉందని తెలిపారు. తక్షణమే ఎగుమతికి అనుమతి ఇవ్వకపోతే ఉల్లి పాడయ్యే అవకాశం ఉందని.. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సభ దృష్టికి తీసుకువచ్చారు. విజయసాయిరెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్.. ఉల్లి ఎగుమతికి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
రైతుల సమస్యపై సానుకూలంగా స్పందించినందుకు పీయూష్ గోయల్‌కు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కాగా, కేపీ ఉల్లి ఎగుమతికి అనుమతిచ్చాలంటూ సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, తలారి రంగయ్య, ఎన్.రెడ్డెప్పలు పీయూష్ గోయల్‌ను కలిసిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జీరో అవర్‌లో రైతు సమస్యలపై ప్రసావిస్తుండగా.. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అప్రజాస్వామిక చర్యల వల్లే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు.
చదవండి : కేపీ ఉల్లి ఎగుమతులకు త్వరలోనే అనుమతి