‘మన్నవరం ఎప్పటికి పూర్తవుతుంది’
న్యూఢిల్లీ: మన్నవరం విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టు అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభలో ప్రస్తావించారు. 2010లో ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేసినా ఇప్పటివరకు ఇక్కడ గుర్తించదగ్గ పని జరగలేదని ఆయన రాతపూర్వక ప్రశ్నలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వాస్తవ వ్యయం, దీని ద్వారా కలిగే ఉపాధి విషయాలను వెల్లడించాలని విజయసాయిరెడ్డి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కోరారు.
దీనికి సమాధానం ఇచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్.. బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీల జాయింట్ వెంచర్ కంపెనీ ఎన్‌బీపీపీఎల్ ఆధ్వర్యంలో చేపడతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశల్లో ఆరువేల కోట్లతో చేపట్టాలని భావించినా.. అనంతరం మొదటి దశ పెట్టిబడిని తగ్గించుకున్నట్లు తెలిపారు. 2011 లో ఎన్‌బీపీపీఎల్ నిర్వహించిన బోర్డు సమావేశంలో రెండో దశ పనులకు నాలుగైదేళ్ల తరువాతే వెల్లాలని నిర్ణయించుకుందని సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6100 మంది ఉపాధి లభింస్తుందని డీపీఆర్‌లో అంచనావేసినట్లు తెలిపారు.