నాలుగేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి | Plan To Complete All Pending Projects Within Four Years Says Ys jagan | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి

Published Fri, Sep 13 2019 4:11 AM | Last Updated on Fri, Sep 13 2019 9:51 AM

Plan To Complete All Pending Projects Within Four Years Says Ys jagan - Sakshi

నాలుగేళ్లలోగా పెండింగ్‌ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

నీళ్ల కోసం జిల్లాల మధ్య కొట్లాటలు ఉండకూడదు.. ఆప్యాయతలు పంచుకునే వాతావరణం ఉండాలి. మహేంద్రతనయ నుంచి హంద్రీ–నీవా వరకు పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ నాలుగేళ్లలో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా ప్రాజెక్టులకు నిధులు భారీగా కేటాయిస్తాం. ప్రతి రూపాయినీ సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.
వరద జలాలను ఒడిసిపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం.

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి, వంశధార వరద జలాలను ఒడిసిపట్టి బంజరు భూములకు మళ్లించి  రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నాలుగేళ్లలోగా పెండింగ్‌ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. జిల్లాలవారీగా ఏ ప్రాజెక్టులను ఏ ఏడాది పూర్తి చేయవచ్చో నివేదిక ఇస్తే వాటినే ఆయా సంవత్సరాల్లో ప్రాధాన్య ప్రాజెక్టులుగా పరిగణిస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టును పరిశీలించినా స్కామ్‌లే కనిపిస్తున్నాయని, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అవినీతిని నిర్మూలించాలని ఆదేశించారు.

ప్రతీ రూపాయిని సద్వినియోగం చేసుకుని పారదర్శకంగా, శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలవారీగా అధ్యయనం చేసి నీటి లభ్యత ఉంటే కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచిన కొత్త ప్రాజెక్టుల పనులు, 25 శాతం లోపు పూర్తయిన ప్రాజెక్టుల పనులను నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు చేపట్టాలని సీఎం సూచించారు.

తొలిసారిగా పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులకుపైగా తరలింపు..
దేవుడి దయ వల్ల ఈ ఏడాది కృష్ణా నదికి రెండోసారి వరద వచ్చిందని.. వరద జలాలు భారీగా సముద్రంలో కలుస్తున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అయితే రాయలసీమ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ప్రాజెక్టులు నింపడానికి చాలా సమయం పడుతోందని, లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులకు సూచించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న రాయలసీమ ప్రాజెక్టులు 120 రోజులపాటు వరద జలాలను మళ్లించేలా చేపట్టినవని తెలిపారు. కృష్ణా నదికి 120 రోజులు వరద వస్తుందన్న లెక్కలు సవరించాలని.. 30 నుంచి 40 రోజులు మాత్రమే వరద ఉంటుందని లెక్క వేసి ఆలోగా వెలిగొండతోపాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులను నింపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కేవలం 6 నుంచి 8 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలమని, ఈసారి వచ్చిన వరదల వల్ల జలయ/æ్ఞం తొలి ఫలాలను అందుకున్నామని అధికారులు వివరించారు. తొలిసారిగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 44 వేల క్యూసెక్కులకుపైగా తరలించామన్నారు. వెలుగోడు నుంచి కడపకు వెళ్లే తెలుగుగంగ కాలువ లైనింగ్‌ పనులు పూర్తి కాలేదని, అందువల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు ఆశించినంత మేర నీటిని తీసుకెళ్లలేకపోయామని అధికారులు తెలిపారు.

సమస్యలపై ఒడిశా సీఎంతో చర్చిస్తాం..
వంశధార రెండో దశలో భాగమైన నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేస్తోందని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు నివేదించారు. జంఝావతిపై కూడా ఒడిశా అభ్యంతరాల వల్ల పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందించలేకపోతున్నామన్నారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ  నివేదిక ఇస్తే ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. వంశధార కెనాల్‌ లైనింగ్‌ పనులు, హీరమండలం రిజర్వాయర్‌ నుంచి హైలెవల్‌ కెనాల్‌ పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.తోటపల్లి ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వకు వీలుగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. మహేంద్ర తనయ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఉద్దానంలో కలుషితమైన భూగర్భ జలాలు తాగి ప్రజలు మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్నారని, నదీ జలాలను అందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

వెలిగొండ పనులు వేగంగా పూర్తి కావాలి
వెలిగొండ మొదటి సొరంగంలో 1.56 కి.మీ. మేర పనులు మిగిలాయని అధికారులు వివరించగా వాటిని వెంటనే పూర్తి చేయాలని, రెండో సొరంగం పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణకు జోలదరాసి, రాజోలి బ్యారేజీల నిర్మాణ పనులను చేపట్టాలని నిర్దేశించారు. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు వరికపూడిశెల ప్రాజెక్టులో అన్ని దశలను ఒకేసారి చేపట్టాలని సూచించారు. గుంటూరు చానల్‌ను పొడిగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు.

ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ల తయారీకి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, అన్ని ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

నిర్వాసితులకు ఉదారంగా పునరావాసం..
పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టులో నీరు  నిల్వ చేయాలంటే నిర్వాసితులకు ఆలోగా పునరావాసం కల్పించాలన్నారు. అందుకే సహాయ, పునరావాస(ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించామని గుర్తు చేశారు. వరదల్లో మునిగిన ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వచ్చే సీజన్‌లోగా ఆ ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలన్నారు. ఈ సీజన్‌లో ఉత్పన్నమైన పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, మానవతా దృక్పథంతో నిర్వాసితులకు పరిహారం అందించాలన్నారు.

‘‘ఆక్వా సాగు కారణంగా కాలువలు కలుషితంగా కాకుండా చూడాలి. ఎక్కడ అవసరమైతే అక్కడ మురుగు నీటి శుద్ధి  కేంద్రాలను ఏర్పాటు చేయండి. నీటి కాలుష్యానికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలి. కలుషిత నీటిని తాగడం వల్లే ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతిదీ కలుషితం అవుతోంది. దీనివల్లే ఇంతకుముందు అరుదుగా కనిపించే క్యాన్సర్‌ వ్యాధి ఇప్పుడు విస్తృతమైంది’’
– సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement