పాలన సవ్యంగా సాగిపోతుంటే పాపం రామోజీకి నిద్రపట్టడం లేదు. పథకాలు సక్రమంగా అమలవుతుంటే ఆయన విష‘పత్రిక’కు నచ్చడం లేదు. ప్రభుత్వానికి ప్రజాభిమానం రోజురోజుకూ పెరిగిపోతుంటే సహించడం లేదు. క్రమ పద్ధతిలో ప్రాజెక్టులు పూర్తవుతుంటే ఆ ‘పచ్చ’కళ్లకు కనిపించడం లేదు. అడ్డగోలు రాతలతో రెచ్చిపోయి... తప్పుడు కథనాలతో జనాన్ని తప్పుదారి పట్టించి... వికృతానందం పొందాలని తెగ తాపత్రయపడుతున్నారు.
‘బాబు’ కళ్లలో ఆనందం చూడాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు. వాస్తవమేంటో కళ్లకు కనిపిస్తున్నా... జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాగే ప్రాజెక్టులపైనా లేనిపోని ఆరోపణలు చేసి ఓ కథనాన్ని వండివార్చేశారు. కానీ రాష్ట్రంలో ప్రాజెక్టులు పరుగులు పెట్టింది ఈ ప్రభుత్వంలోనే అన్నదిప్రజలందరికీ అర్థమవుతున్నా... పాపం ఈనాడుకే ఎందుకో తెలియడం లేదు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంటే ‘ఈనాడు’ రామోజీరావు ఓర్వలేకపోతున్నారు. రైతుల్లో సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు రోజురోజుకూ పెరుగుతుండటం.. అది చంద్రబాబు రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తూండటంతో పచ్చబ్యాచ్ ఆందోళన చెందుతోంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పుంఖానుపుంఖాలుగా సీఎం వైఎస్ జగన్‌పై విషపు రాతలకు తెగబడుతున్నారు. అ కోవలోనే ప్రాజెక్టులపై అబద్ధాలను అచ్చేసింది. గడచిన 57 నెలల్లో కరోనా ప్రభావం వల్ల దాదాపు 24 నెలలు ప్రపంచమే స్తంభించిపోయింది. మిగిలిన 33 నెలల్లోనే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, అవుకు రెండో టన్నెల్, లక్కసాగరం ఎత్తిపోతలను పూర్తి చేసి, జాతికి అంకితం చేశారు.
కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే ఆ జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించనున్నారు. మరో 14 ప్రాజెక్టులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి.
♦ బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్‌వాల్ లీకేజీలకు అడ్డుకట్ట వేయడం, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి, సోమశిల, కండలేరు జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు.
♦ తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువకు లైనింగ్ చేయడం ద్వారా సకాలంలోనే వెలిగోడు, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లను నింపుతున్నారు. ఏటా కోటి ఎకరాల ఆయకట్టుకు నీరందించారు.
♦ చంద్రబాబు అవినీతి వల్ల విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి.. ప్రణాళికాయుతంగా
సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. నిర్వాసి తులకు పునరావాసం కల్పించి, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, స్పిల్ చానల్, స్పిల్ వేను పూర్తి చేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని పోలవరం స్పిల్ వే మీదుగా మళ్లించారు.
♦ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణకు సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే దాన్ని చేపట్టి.. ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేయడం ద్వారా పోలవరం ఫలాలను రైతులకు అందించడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు.
♦ 57 నెలల్లో సాగునీటి ప్రాజెక్టులకోసం వెచ్చించినది రూ.32,161.49కోట్లు
♦ సాగునీటికి నోచుకున్న మొత్తం విస్తీర్ణం 9.86 లక్షల ఎకరాలు
నాడు బాబు నిర్లక్ష్యంపై ప్రశ్నించలేదెందుకు?
2014 జూలై 28వ తేదీన టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తానని ప్రకటించారు. 2014, జూన్ 8 నుంచి 2019 మే 29 వరకూ సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.68,293.95 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు.
జీవో 22, జీవో 63లను అడ్డుపెట్టుకుని అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి.. ఆస్థాన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి భారీ ఎత్తున దోచుకున్నారు. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తికి పోలవరం పనులే తార్కాణం. సబ్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికే చంద్రబాబు ప్రతి సోమవారాన్ని సమీక్షల పేరుతో పోల‘వరం’గా మార్చుకున్నారని అప్పటి ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
పోలవరంలో రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీ వియ్యంకుడికి చెందిన నవయుగకు కట్టబెట్టారు. చంద్రబాబు దోపిడీలో రామోజీ కి వాటా ఉండటం వల్లే అప్పట్లో సాగునీటి ప్రాజెక్టులో సాగిన దోపిడీపై ఒక్క అక్షరమైనా ఈనాడులో అచ్చేయ లేదన్నది బహిరంగ రహస్యం.
Comments
Please login to add a commentAdd a comment