
వాడిపోతున్న పచ్చతోరణం
సాక్షి, కాకినాడ :మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు, నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చాలన్నది ఉపాధి హామీ పథకం ద్వారా అమలయ్యే పచ్చతోరణం, గట్లపై మొక్కల పెంపకం పథకాల లక్ష్యం. జిల్లాలో ఈ ఏడాది రూ.155 కోట్లతో 10, 774 ఎకరాల్లో మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 8 వేల ఎకరాల్లో ఉద్యాన వన పంటలు, 2666 ఎకరాల్లో బండ్ ప్లాంటేషన్, 108 ఎకరాల్లో ఐపీటీ కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టారు. ఉద్యానవన మొక్కల పెంపకం వరకు లక్ష్యాన్ని అధిగమించినా..బండ్ ప్లాంటేషన్, పచ్చ తోరణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారయ్యాయి.
ఐపీటీతో పాటు ఉద్యానవన ప్రాజెక్టు కింద ఒక్కో మొక్కకు రూ.15, మంచినీటి సదుపాయానికి రూ.4.15, పొలంగట్లపై నాటే మొక్కలకు రూ.5 చొప్పున మంజూరు చేస్తారు. బండ్ ప్లాంటేషన్‌కు రెండేళ్లు, ఉద్యానవన పంటలకు మూడేళ్లు , ఐపీటీకి ఐదేళ్ల పాటు ఈ నిర్వహణా నిధులు ఇస్తారు. పొలంగట్లపై నాటేందుకు ఒక్కో రైతుకు ఎకరాకు 100 నుంచి 150, ఐపీటీ కింద వంద నుంచి 200 మొక్కలు అందజేస్తారు. ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేసిన ఎస్సీ, ఎస్టీలకు మొక్కలను అప్పగించి వాటిని సంరక్షించడానికి కొంత డబ్బును అందించాలి. మొక్కలు పెరిగాక వాటి పండ్లు, కాయలను విక్రయించి లబ్ధిదారులు ప్రయోజనం పొందవచ్చు.
8 వేల ఎకరాల్లో ఉద్యానవన మొక్కలు పెంచాల్సి ఉండగా రూ.3.67కోట్లతో 11,616 ఎకరాల్లో మొక్కలు పెంచి రికార్డు సృష్టించారు. 2666 ఎకరాల్లో బండ్ ప్లాంటేషన్ చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.77లక్షల వ్యయంతో కేవలం 26 మండలాల పరిధిలో 466 ఎకరాల్లో సుమారు పదివేల టేకు మొక్కలు మాత్రమే నాటగలిగారు. పచ్చతోరణం ప్రారంభించి ఏడాదిన్నర కావస్తోంది. జిల్లాలో 108 ఎకరాల్లో ఈ పథకాన్ని చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.22 లక్షలతో నాలుగంటే నాలుగు ఎకరాల్లో కేవలం 300 మొక్కలు మాత్రమే నాటగలిగారు.
లక్ష్యాలే ఘనం.. సాధించింది స్వల్పం
బండ్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని చేరుకోకపోవడంలో అధికారుల చిత్తశుద్ధి లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గట్లపై టేకుమొక్కల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించడానికి అధికారులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ పథకం కింద ఈ ఏడాది 2,985 మంది రైతుల పొలం గట్లపై 5.11 లక్షల మొక్కలు పెంచాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు మొక్కలు నాటేందుకు కేవలం 60 వేల గోతులు తవ్వగా, 10 వేల మొక్కలు మాత్రమే నాటగలిగారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువుల శిఖం భూములు, ఏటిగట్లు, ఆర్ అండ్ బి రహదారులతో పాటు ఇతర ప్రభుత్వ భూముల్లో కొబ్బరి, మామిడిమొక్కలు నాటి, అవి బతికే వరకూ ఉపాధి సిబ్బందే పెంచి, అనంతరం పెంపకం బాధ్యతను అర్హులైన ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు అప్పగించాలన్నది పచ్చతోరణం లక్ష్యం. పూర్తిగా ప్రభుత్వ భూముల్లోనే మొక్కలు పెంచాల్సి ఉండగా సంబంధిత శాఖలను సమన్వయపర్చి భూములను గుర్తించడంలో ఉపాధి
హామీ అధికారులు విఫలమయ్యారు. జిల్లాలో కేవలం రాజమండ్రి రూరల్‌లో రెండెకరాల్లో, కోరుకొండ, రాజోలు మండలాల్లో ఒక్కో ఎకరంలో మాత్రమే ఈ ప్రాజెక్టును చేపట్ట గలిగారు. కేవలం మూడు మండలాల్లో నలుగురంటే నలుగురు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే లబ్ధి చేకూర్చ గలిగారు. అలాగే నాటిన మొక్కలను లబ్ధిదారులకు అప్పగించే వరకూ పెంచడంలో కూడా విఫలమవుతున్నారు.దీనిపై డ్వామా అధికారులను వివరణ కోరగా బండ్ ప్లాంటేషన్ విషయంలో రైతుల్లో మరింత చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక పచ్చతోరణం విషయానికొస్తే.. ప్రభుత్వ భూములను గుర్తించి తమకు అప్పగించడంలో వివిధ శాఖల అధికారులు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.