సాక్షి, నల్లగొండ: ఉపాధి హామీ పథకం కింద నాటిన పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) అధికారులు సకాలంలో డ్రిప్ ఏర్పాటు చేయకపోవడంతో వాటికోసం వెచ్చించిన లక్షల రూపాయలు వృథా అవుతున్నాయి. ఫలితంగా లక్ష్యం నెరవేరడం లేదు. కొంతమందికి చెందిన భూముల్లో మాత్రమే డ్రిప్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. మిగిలిన రైతులు మొక్కలను బతికించుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. అయినా అధికారుల్లో చలనం లేదు.
పథకం తీరు..
ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న సదుద్దేశంతో వారి పొలాల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టారు. జిల్లావ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన 37 మండలాల్లో 1,917 రైతులకు చెందిన 4,400 ఎకరాలను గుర్తించారు. ఇందులో దాదాపు 3.50 లక్షల మామిడి, బత్తాయి, నిమ్మ మొక్కలను గతేడాది నాటారు. వీటికి సాగునీటిని అందించడానికి ప్రభుత్వం సబ్సిడీపై డ్రిప్ అందజేస్తోంది. 50:20 శాతం లెక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మిగిలిన 30 శాతం నిధుల్ని ఉపాధి హామీ పథకం విడుదల చేస్తుంది. డ్రిప్‌ను అందించే బాధ్యతను ఏపీఎంఐపీకి ప్రభుత్వం అప్పగించింది.
ఇదీ పరిస్థితి....
పండ్ల మొక్కలు నాటిన రైతులందరికీ డ్రిప్ అందజేయాలి. ఇది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఇప్పటివరకు 1,108 మంది రైతులకు చెందిన 2,617 ఎకరాల్లో మాత్రమే సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు అధికారులు డ్రిప్ ఏర్పాటు చేశారు. మిగిలిన 809 మంది రైతులకు చెందిన 1,783 ఎకరాల్లో డ్రిప్ అమర్చడం మరిచి పోయారు. దీంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. రేపు మాపు అంటున్నారే తప్ప మంజూరు చేసిన పాపానపోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండుతున్న మొక్కలు
మొక్కల్ని బతికించుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. నీరందక పోవడంతో ఏడాది క్రితం నాటిన మొక్కలు ఎండుముఖం పడుతున్నాయి. పలుచోట్ల వందల కొద్ది మొక్కలు ఎండిపోయాయి. ఎండిన మొక్కల స్థానంలో కొందరు రైతులు తిరిగి మొక్కలు నాటుకున్నారు.
డిప్ అందజేస్తారని ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. తీరా వేసవి ప్రవేశించినా అంద లేదు. బిందెలతో మొక్కలకు నీరుపోశారు. సుదూర ప్రాంతం నుంచి నీరు మోసుకొచ్చి కాపాడుకున్నారు. ఇందుకోసం కొందరు డబ్బులు చెల్లించి కూలీలను పెట్టుకున్నారు. ఈ భారం భరించలేక పలువురు స్వతహాగా నీరు పోశారు. అయినా కొన్ని మొక్కలు బతకలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా డ్రిప్ అందజేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
డ్రిప్ మరిచారు
ఉపాది హమీ పథకం కింద 300 నిమ్మ మొక్కలు ఇచ్చారు. వీటిని నాకున్న 4 ఎకరాల్లో పోయిన ఏడాది నాటాను. మొక్కలతో పాటు డ్రిప్ సౌకర్యం కూడా కల్పించాల్సి ఉంది. డ్రిప్ ఇవ్వకపోవడంతో దాదాపు 100 మొక్కలకు పైనే ఎండిపోయాయి. ఎండాకాలంలో వడగాలులకు బిందెలతో నీరు పోశాం. కొన్ని మొక్కలు ఎలాగోలా బతికాయి. కొన్ని కళ్ల ముందే ఎండిపోయాయి. డ్రిప్ మంజూరు చేయాలని అధికారులు చుట్టూ చాలాసార్లు తిరిగిన. అయినా ఇంతవరకు డ్రిప్ ఇవ్వలేదు.
- దిండుగాల లక్ష్మయ్య, రైతు, నోముల
ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం
మా ఊర్లో కొంత మందికి డ్రిప్ ఇచ్చారు. మరికొందరికి ఇవ్వలేదు. మేమంతా నల్లగొండ ఆఫీసుకు పలుమార్లు పోయాం. ఐదెకరాలలో ఉపాధి హమీ పథకం కింద నిమ్మ మొక్కలు నాటాను. ఏడాది దాటినా డ్రిప్ సౌకర్యం ప్రభుత్వం కల్పించ లేదు. వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాం. నిన్నమొన్న రోజుకు నలుగురు కూలీలతో మొక్కలకు నీరు పోయించాం. ఇందుకోసం అయినా నీరందక 120 పైనే మొక్కలు ఎండిపోయాయి. ఇటీవల వర్షాలు పడితే నీళ్లు పోయడం బంద్ చేశాం. ప్రభుత్వం మొక్కలు ఇవ్వకుంటే ఇతర పంటలైన పండించుకునే వాళ్లం. దీంతో కొంతైనా లాభపడే వాళ్లం.
- ముసుగు శంభులింగారెడ్డి, నోముల
ఎండుతున్న ఆశలు
Published Mon, Aug 12 2013 5:07 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement