హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : ప్రతి రెండేళ్లకోసారి అత్యంత ఘనంగా జరిగే మేడా రం జాతరను ప్లాస్టిక్ ముప్పు వెంటాడుతోంది. ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యతో సమానంగా జాతరలో ప్లాస్టిక్ వాడకం పెరుగుతోంది. ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్న పాలిథిన్ కవర్లు, గ్లాసుల కారణంగా జాతర పరిసరాలు కలుషితమై పోతున్నాయి. వాటిని నియంత్రించలేక అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు.
అన్నిటికీ పాలిథిన్ కవర్లే
గత జాతరకు 80లక్షల మంది హాజరైనట్టు అంచనా. మూడు రోజులపాటు జరిగిన జాతరలో కొబ్బరికాయలు తీసుకెళ్ల డం నుంచి అన్నింటికీ పాలిథిన్ కవర్లనే అధికంగా వినియోగించడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పేరుకుపోయా యి. అలా పోగైన చెత్త అక్షరాలా ఇరవై టన్నుల పైమాటేనని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు.
ఈసారి మరింత పెరిగే అవకాశం
ఈసారి మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయం గా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈసారి భక్తుల సంఖ్య కోటి దాటుతుందని అంచనావేస్తున్నారు. ఫలితంగా ప్లాస్టిక్ వినియోగం కూడా పెద్ద ఎత్తున ఉంటుందని, ఇదే జరిగితే ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టల్లా పేరుకుపోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈసారి జాతరలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించినట్టు చెబుతున్న అధికారులు దానిని పకడ్బందీగా అమలు చేయగలిగితే పాలిథిన్ కవర్ల వాడకాన్ని కొంతవరకు నియంత్రించవచ్చని పేర్కొంటున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పేపర్ బ్యాగులతో ప్లాస్టిక్‌కు చెక్
పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్‌ను తరిమికొట్టేందుకు అందరూ కలిసికట్టుగా కృషిచేయాలని పర్యావర ణ ప్రేమికులు కోరుతున్నారు. జాతరలో ప్లాస్టిక్ వాడకానికి అడ్డుకట్ట వేయాలంటే మొదట పేపరు బ్యాగులను ప్రోత్సహించాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే పేపరు, జూట్ బ్యాగులు, గ్లాసులు తయారుచేసే కుటీర పరిశ్రమల యజ మానులతో సమావేశం నిర్వహించాలి. కోటిమందికి పైగా సరిపడే బ్యాగులను తయారుచేయించాలి.
ఇందుకోసం వారికి రుణ సదుపాయం కల్పించాలి. అంతేతప్ప జాతర సమయం సమీపిస్తున్న తరుణంలో అవగాహన సదస్సులు, ప్రకటనలు జారీచేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలనే వాడాలని నిర్వహించిన చైతన్య కార్యక్రమాలు, ప్రచారం కారణంగా ప్రజల్లో వచ్చిన మార్పును స్ఫూర్తిగా తీసుకుని ఆ దిశగా కృషిచేస్తే మంచి ఫలితం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
వనజాతరకు ప్లాస్టిక్ ముప్పు
Published Tue, Jan 14 2014 3:17 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
Advertisement