సాక్షి, అమరావతి/ తిరుపతి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల పర్యటన ముగిసింది. శ్రీవారి దర్శనం అనంతరం రేణిగుంట ఏయిర్ పోర్ట్‌కు వెళ్లిన మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏయిర్‌పోర్ట్ వరకూ వెళ్లి ప్రధానికి వీడ్కోలు పలికారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలతో కలిసి ప్రధాని మోదీ శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించిన మోదీ, నరసింహన్, వైఎస్ జగన్ తిరుమలేశుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయంలో శ్రీవారిని దర్శించిన అనంతరం.. విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి హుండీలో ప్రధాని మోదీ కానుకలు సమర్పించారు. ఆలయాన్ని రోజూ ఎంతమంది భక్తులు దర్శించుకుంటారంటూ.. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రధాని మోదీ ఆరా తీశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో మోదీ, నరసింహన్, వైఎస్ జగన్‌కు టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవారి శేషవస్త్రాన్ని ప్రధాని మోదీకి టీటీడీ అర్చకులు అందజేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. శ్రీవారి చిత్రపటాన్ని మోదీకి కానుకగా ఇచ్చారు. రంగనాయకుల మండపంలో ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్ శ్రీవారి ప్రసాదాన్ని ఆరగించారు. అంతకుముందు తిరుమలకు వచ్చిన ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్, టీటీడీ ఈవో అనీల్‌కుమార్ సింఘాల్, ఇతర అధికారులు సాదర స్వాగతం పలికారు. రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి నరేంద్రమోదీ శ్రీవారి దర్శనానికి వచ్చిన సంగతి తెలిసిందే.
తిరుమలకు చేరుకున్న వైఎస్ జగన్
అంతకముందు తిరుమల చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. కొండ మీద పద్మావతి ప్రాతంలో ఉన్న అతిధి గృహానికి వెళ్లారు. మరికాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీ కూడా తిరుమలకి రానున్నారు. అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్ కలిసి శ్రీవారి దర్శించుకోనున్నారు.
జగన్‌కు అభినందనలు.. ఏపీకి సంపూర్ణ సహకారం: మోదీ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఏపీలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏపీకి అన్ని విధాల సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలందరి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతికి వచ్చిన నరేంద్రమోదీని ‘ప్రజా ధన్యవాద సభ’లో బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు. తలపాగా పెట్టి, గజమాల వేసి.. శాలువాతో ఆయనకు సన్మానం చేశారు.
రేణిగుంట నుంచి నేరుగా ఈ సభకు వచ్చిన ప్రధాని మోదీ సభలో ప్రసంగిస్తూ.. ‘బాలాజీ పాదపద్మాల సాక్షిగా నాకు మరోసారి అధికారం అప్పగించిన భారత దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు, స్వామికి నా ప్రణామాలు’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ‘రెండోసారి విజయం సాధించిన తర్వాత శ్రీవారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. తిరుపతికి గతంలో ఎన్నోసార్లు వచ్చాను. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి తిరుపతి రావడం ఆనందంగా ఉంది. శ్రీలంక పర్యటన ఆలస్యం కావడం వల్ల ఇక్కడికి కొంచెం ఆలస్యంగా వచ్చాను. ఎన్నికలు గెలువడం మాత్రమే కాదు.. ప్రజల మనస్సులను కూడా గెలవాల్సి ఉంది. ఇందుకోసం 365 రోజులూ పార్టీ శ్రేణులు పనిచేయాలి’ అని మోదీ పేర్కొన్నారు.
మోదీకి ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపటిక్రితమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదర సాగతం పలికారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికిన వారిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, పార్టీ విప్ చెవిరెడ్డి భాస్కర్, భూమన కరుణాకర్‌రెడ్డి, పలువురు వైఎస్సార్‌సీపీ, బీజేపీ నేతలు ఉన్నారు. అనంతరం రేణిగుంట నుంచి నేరుగా తిరుపతి సభకు ప్రధాని మోదీ వెళ్లారు. తిరుపతిలోని కార్బన్ ఉత్తత్తి కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన ‘ప్రజా ధన్యవాద సభ’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సభ అనంతరం ఆయన తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం 6. 15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాత్రి 8. 15 గంటలకు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళతారు.
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం సాయంత్రం 4.30 గంటలకు రోడ్డుమార్గాన సీఎం వైఎస్ జగన్ తిరుమలకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకుంటారు. రాత్రి 8. 15 గంటల ప్రాంతంలో ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి సాదర వీడ్కోలు పలుకుతారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి ఆయన బయలుదేరుతారు.
రేణిగుంటలో భారీ ఈదురుగాలులు
తిరుపతి: రేణిగుంటలో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ ఈదురుగాలుల వల్ల ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనబోతున్న ‘ప్రజా ధన్యవాద సభ’ వద్ద చిన్న అపశ్రుతి దొర్లింది. సభ వద్ద ఏర్పాటుచేసిన టెంటు ఒకటి కూలింది. అయితే, ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదం తృటిలో తప్పింది.
తిరుపతిలో ప్రారంభమైన బీజేపీ సభ
ప్రధాని నరేంద్రమోదీ రాక నేపథ్యంలో తిరుపతిలో బీజేపీ చేపట్టిన ‘ప్రజా ధన్యవాద సభ’ ప్రారంభమైంది. ఈ సభలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోతున్న ఈ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీలో ఎన్టీఆర్ ఆశయాలు లేవని, నారావారి ఆశయాలు మాత్రమే ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని, కానీ చంద్రబాబు ఆ పార్టీని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే ఓడిపోయిందని అన్నారు.
(చదవండి: ‘చంద్రబాబును ప్రజలు క్షమించరు’ )
రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటిక్రితమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఇక, కొలంబో నుంచి తిరుమలకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరికాసేపట్లో ఇక్కడికి రానున్నారు. ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలుకనున్నారు. అనంతరం ఇక్కడి కార్బన్ ఉత్తత్తి కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సభ అనంతరం ఆయన తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం 6. 15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాత్రి 8. 15 గంటలకు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళతారు.
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం సాయంత్రం 4.30 గంటలకు రోడ్డుమార్గాన సీఎం వైఎస్ జగన్ తిరుమలకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకుంటారు. రాత్రి 8. 15 గంటల ప్రాంతంలో ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి సాదర వీడ్కోలు పలుకుతారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి ఆయన బయలుదేరుతారు.
ముగిసిన ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన
ప్రధాని నరేంద్రమోదీ తొలి విదేశీ పర్యటన ముగిసింది. ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి శ్రీలంకలో పర్యటించిన ఆయన.. తన పర్యటన ముగించుకొని కొలంబో నుంచి తిరుమలకు బయలుదేరారు. మరికాసేపట్లో రేణిగుంట విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వైఎస్ జగన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం చిత్తూరు జిల్లా వెళ్లబోతున్నారు. ఇందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్రమోదీకి ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలుకనున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు వస్తుండటంతో అధికార యంత్రాంగం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకు మూడువేల మందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. వీరిరువురు ప్రయాణించే మార్గాల్లో అణువణువు తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా ఆయా మార్గాల్లో అధికారులు శనివారం ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.
ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ తిరుమల షెడ్యూల్..
- మధ్యాహ్నం 3.45కు రేణిగుంటకు చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్
- ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న గవర్నర్, ముఖ్యమంత్రి
- సాయంత్రం 4.30 గంటలకు రోడ్డు మార్గాన తిరుమలకు సీఎం జగన్
- రాత్రి 8 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి
Comments
Please login to add a commentAdd a comment