జిల్లా ప్రజల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయాలని రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
ఏలూరు(ఆర్‌ఆర్ పేట) : జిల్లా ప్రజల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయాలని రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరులోని సమాఖ్య కార్యాలయంలో ఆయన విలేక రులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నదీజలాల విని యోగ విధానం కారణంగా రాష్ట్రంలోని రైతులు, ప్రజల ప్రయోజనాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. కృష్ణ, గోదావరి నదీజలాల వినియోగంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల తరువాత మన రాష్ట్రం చివరన ఉండటంతో, దిగువకు నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
తెలంగాణలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు నీరు రాని కారణంగా తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చే ప్రాణహిత, ఇంద్రావతి నదీజలాలను తరలించుకుపోవటానికి మేడిగడ్డ, అన్నారం, సందిళ్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి పూనుకోవడంతో, రాష్ట్ర ప్రజలు మరింత ప్రమాదంలో పడబోతున్నారని పేర్కొన్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు 1,480 టీఎంసీల గోదావరి నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయిందన్నారు. దానిలో 900 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి, 580 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి విభజించారన్నారు. ఆంధ్రాకు వచ్చే 580 టీఎంసీలలో గోదావరి డెల్టాకు 260 టీఎంసీలు, పోలవరం ప్రాజెక్టుకు 302 టీఎంసీలు, చిన్న ప్రాజెక్టులకు 18 టీఎంసీలను పంపంకం చేసిందన్నారు.
పోలవరానికి కేటాయించిన నీటిలో అధిక భాగం సముద్రంలో కలిసిపోతోందన్నారు. ఆ నీటిని నిలువ చేసేందుకు పోలవరం ’పాజెక్టును త్వరగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాను రప్పించుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకుగాను ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి తగిన కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రూ.40 వేల కోట్లను కేంద్రం వెంటనే విడుదల చేసే వరకూ పోరాటం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ముందుకు రావాలని కోరారు.