నెల రోజుల కిందట సీఈఓ ఏమన్నారు?
జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టిన పోలవరం అథారిటీ సీఈఓ దినేష్‌కుమార్ సరిగ్గా నెల రోజుల కిందట.. అంటే ఫిబ్రవరి 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి వచ్చిన అథారిటీ.. ఆ పనులు జరుగుతున్న తీరుపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రాసిన లేఖ అది. ఇప్పుడు జరుగుతున్న తరహాలో పనులు జరిగితే..
ప్రాజెక్టు పూర్తిచేయడానికి ప్రతిపాదిత సమయానికన్నా చాలా ఎక్కువ కాలం పడుతుందని.. ప్రాజెక్టుతో పాటు, దాని ప్రయోజనాలు నెరవేరటంలోనూ తీవ్ర జాప్యం జరుగుతందని ఆ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంతో పాటు.. పోలవరం అథారిటీ లేవనెత్తిన మరిన్ని అంశాలను ‘సాక్షి’ మంగళవారం నాడు ప్రచురించిన తన కథనంలో వివరించింది.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేపధ్యంలో.. దీని నిర్మాణ బాధ్యతలు కూడా కేంద్రం చేతుల్లోకి వెళతాయని.. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తికాకపోతే ప్రస్తుత కాంట్రాక్టును రద్దు చేసే అవకాశం ఉంటుందని.. కాబట్టి ఈ పనుల బాధ్యత కేంద్రం చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని అధికార వర్గాల ద్వారా అందిన సమాచారాన్ని ‘సాక్షి’ వెల్లడించింది.
‘మినిట్స్’ చూపుతూ చంద్రబాబు ఏం చెప్పారు?
ఈ కథనమంతా అసత్యమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు శాసనసభలో మండిపడ్డారు. ఆ క్రమంలో పోలవరం అథారిటీ తొలి సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను సభలో చూపించారు. ‘నిన్ననే.. అంటే మార్చి 16వ తేదీన ఢిల్లీలో పోలవరం అథారిటీ సమావేశం జరిగిందని.. ఆ మినిట్సే మాకు పంపార’ని చెప్పారు. దాని ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత కాంట్రాక్టులను కొనసాగించేందుకు, రాష్ట్ర ప్రభుత్వమే పనులు చేపట్టేందుకు ఆ అథారిటీ అనుమతించిందని, ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే నిధులను తిరిగి ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ‘సాక్షి’ అసత్యాలు రాస్తోందంటూ నిప్పులు చెరుగుతూ ఈ మాటలు అన్నారు.
నెల రోజుల్లోనే సీఈఓ వైఖరి మారిందంటే అర్థమేమిటి?
చంద్రబాబు చెప్పిన ఈ మాటలే.. ‘సాక్షి’ చెప్పిందే వాస్తవమని నిరూపిస్తున్నాయి. నెల రోజుల కిందట.. ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసిన పోలవరం అథారిటీ సీఈఓ.. సరిగ్గా నెల రోజుల్లోనే.. ‘ప్రస్తుత కాంట్రాక్టునే కొనసాగించాల’ని ఎందుకన్నారు? దీని వెనుక ఉన్న ఒత్తిడిలు ఏమిటి? వాస్తవానికి నెల రోజుల కిందట పోలవరం అథారిటీ సీఈఓ రాసిన లేఖకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం అథారిటీకి కానీ, కేంద్ర జలవనరుల శాఖకు కానీ ఎటువంటి సమాచారం, సమాధానం ఇచ్చిందీ తెలియదు.
ఏం సంప్రదింపులు జరిపిందీ చంద్రబాబు చెప్పలేదు. కానీ.. ప్రాజెక్టు ప్రస్తుత కాంట్రాక్టును కొనసాగించేలా, అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేలా తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. అందుకే.. సీఈఓ నెల రోజుల్లోనే తన వైఖరిని మార్చుకున్నట్లు అర్థమవుతోంది. సరిగ్గా ‘సాక్షి’ చెప్పిన విషయమిదే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రం చేతుల్లోకి వెళ్లకుండా తన చేతుల్లోనే ఉంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడులు తీసుకొస్తోందనే చెప్పింది. అదే నిజమని.. సీఈఓ వైఖరి నెల రోజుల్లోనే మారిపోవటం స్పష్టం చేస్తోంది.
అది నిర్ణయం కాదు.. సీఈఓ సూచన మాత్రమే
అంతేకాదు.. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రస్తుత కాంట్రాక్టును కొనసాగించాలన్న మాట.. పోలవరం అథారిటీ తీసుకున్న నిర్ణయం కానే కాదు. అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు అమలు విధివిధానాలపై చర్చల సందర్భంగా సీఈఓ చేసిన ఒక సూచన మాత్రమే. అది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సమావేశం మినిట్స్‌లో పేర్కొన్న ‘తీర్మానాలు’లోనూ ఈ అంశం లేదు. అంటే.. ఇది అథారిటీ నిర్ణయమంటూ చంద్రబాబు చెప్పింది పచ్చి అబద్ధం.
అథారిటీ భేటీ 16న ఢిల్లీలో జరగలేదు...
ఈ పోలవరం అథారిటీ మార్చి 16వ తేదీన ఢిల్లీలో సమావేశమైందని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. ఈ మాటలు విని ఢిల్లీ వర్గాలే విస్తుపోయాయి. ఎందుకంటే.. పోలవరం అథారిటీ సమావేశం ఢిల్లీలో జరగలేదు. ఈ నెల 16వ తేదీనా జరగలేదు. వాస్తవానికి ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లోనే పోలవరం అథారిటీ తొలి సమావేశం జరిగింది. ఆ సమావేశం మినిట్స్‌ను ఈ నెల 16వ తేదీన (సోమవారం నాడు) కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వశాఖకు పంపించారు. అంటే.. ఈ సమావేశం జరిగిన తేదీ, ప్రదేశం పైనా చంద్రబాబు నిందు సభలో చెప్పినవి అసత్యాలే.
వ్యయం రీయింబర్స్ తీర్మానానికీ వక్రీకరణ...
ఇక.. పోలవరం అథారిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు బదిలీ చేసే విధానంపైనా చర్చలు జరగాలని, అవసరమైతే ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఈ సమావేశంలో ప్రతిపాదించారు. దీనిపై ఎటువంటి చర్చా జరగలేదు. ఈ ప్రతిపాదనను బట్టే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిధులను తమకు బదిలీ చేయాలని కోరుతున్నట్లు స్పష్టమవుతోంది. కానీ.. చంద్రబాబు మరో అంశాన్ని చూపుతూ.. ప్రాజెక్టు నిధులను రాష్ట్రానికి బదిలీ చేయటానికి పోలవరం అథారిటీ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి.. ఈ అథారిటీ ఏర్పడిన తర్వాత ప్రస్తుత సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని ఏపీ సర్కారుకు రీయింబర్స్ చేయాలని మాత్రమే అథారిటీ తీర్మానం చేసింది. ఈ రీయింబర్స్ అంశాన్ని.. పాలక మండలి చైర్మన్ అయిన జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆమోదానికి నివేదించాలని నిర్ణయించింది. కానీ.. ఈ తీర్మానాన్ని చంద్రబాబు వక్రీకరిస్తూ.. మొత్తం ప్రాజెక్టు వ్యయానికి అయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి రీయింబర్స్ చేయటానికి పోలవరం అథారిటీ నిర్ణయం తీసుకుందని అసెంబ్లీలో అసత్యాలు చెప్పుకొచ్చారు.
కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకునే అధికారం సీఈఓకు...
నిజానికి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నియంత్రణలపై.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వశాఖతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకునేందుకు పోలవరం అథారిటీ సీఈఓకు అధికారమిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అధారిటీ చేసిన తీర్మానాలను పోలవరం ప్రాజెక్టు అధారిటీ గవర్నింగ్ బాడీ ఆమోదం తెలిపాలి. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో గవర్నింగ్ బాడీ ఉంటుంది. గవర్నింగ్ బాడీ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాలి, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం గానీ, పోలవరం అధారిటీ గానీ ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్కడా అనుమతించలేదు. కానీ.. అనుమతించేసిందని నిండు సభలో బల్ల గుద్ది చెప్పుకోవటం ఒక్క బాబుకే చెల్లింది! -న్యూఢిల్లీ, సాక్షి
నిండు సభలో అడ్డంగా దొరికారు
Published Wed, Mar 18 2015 2:54 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement