
పోలవరం పనుల్లో నాణ్యత డొల్ల
సాక్షి, విజయవాడ : జిల్లాలో చేపట్టిన పోలవరం కుడికాలువ నిర్మాణ పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హడావుడిగా పనులు జరిగిన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా, పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మించిన అక్విడెక్ట్ (అండర్ టెన్నెల్ బ్రిడ్జి) 15 నుంచి 20 అడుగుల మేర ఇటీవల ధ్వంసమైన విషయం విదితమే. ఈ కాలువ పొడవు 174 కిలోమీటర్లు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 140 కిలోమీటర్ల మేర పనులు పూర్తిచేసి, రెండు వైపులా లైనింగ్ పూర్తిచేయించారు. మిగిలిన పనులను ఇప్పుడు హడావుడిగా పూర్తిచేశారు.
నాణ్యతపై అనుమానాలు
కృష్ణాజిల్లాలో పల్లెలమూడి, సీతారాంపురం, మడిచర్ల, వే లూరు, రేమల్లె, వీరవల్లి, బండారుగూడెం, సూరంపల్లి, బలిపర్రు, తెంపల్లి, వీరపనేనిగూడెం, చిక్కవరం, కొత్తగూడెం గ్రామాల్లో రైతుల వద్ద నుంచి 1,266 ఎకరాల భూమిని సేకరించి 25 కిలోమీటర్ల మేర కాలువ తవ్వారు. 80 మీటర్ల వెడల్పును 40 మీటర్లకు కుదించారు. బండారుగూడెం రామిలేరు వద్ద చేపట్టిన అక్విడెక్టును అసంపూర్తిగా వదిలేశారు. గ్రామాల్లోకి వెళ్లేందుకు రోడ్ల వద్ద సూపర్ పాసేజ్‌లు నిర్మించాల్సి ఉండగా తూములతో సరిపెట్టారు. మచిలీపట్నం నుంచి ఖమ్మం జిల్లాకు వెళ్లాల్సిన మార్గంలో నూజివీడు మండలం సీతారాంపురం వద్ద వంతెనకు బదులు తూములు ఏర్పాటు చేశారు.
ఇక్కడ నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. వాహనాల వేగాన్ని 20కిలోమీటర్లకు పరిమితంచేస్తూ బోర్డులు, ప్రధాన రహదారిపైనే స్పీడ్ బ్రేకర్లు, పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల రాకపోకల వేగాన్ని నియంత్రిస్తున్నారు. అయితే రాత్రివేళ మాత్రం వాహనాలు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాయి. దీంతో తూములు దెబ్బతింటాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మట్టికట్టలపై రైతుల్లో ఆందోళన
పోలవరం కాలువకు రెండువైపులా లైనింగ్ చేయకుండా మట్టికట్టలు పోసి సరిపెట్టారు. దీంతో వచ్చినకొద్దిపాటి నీటికే కట్టలు కోతకు గురవుతున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టు వద్ద అమర్చిన మోటార్‌ను కట్టివేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తే కట్టలకు గండిపడి నష్టపోతామని సమీప గ్రామ ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం భూమి సేకరించిన తరువాత కొంత మంది రైతుల వద్ద పది పదిహేను సెంట్లు మాత్రమే మిగి లింది. ఈ భూములను కూడా తీసుకుని నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం తొలుత హామీ ఇచ్చి ఇప్పుడు తీసుకోవడంలేదని రైతులు పేర్కొంటున్నారు.
రెంటికీ చెడ్డామంటున్న రైతులు ఆందోళన
పోలవరం కాలువ వెలగలేరులోని భలేరావు చెరువు మీదుగా వెళ్లేలా మాజీ ఎమ్మెల్యే చనమోలు వెంకట్రావ్ హయాంలోనే డిజైన్ చేశారు. చెరువును రిజర్వాయర్‌గా చేసి నీరు లోపలకి వచ్చే, బయటకు వెళ్లే ప్రాంతాల్లో లాకులు ఏర్పాటు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద గోదావరి నీటిని కృష్ణానదిలోకి కలిపారు. ఆ రోజు గోదావరి జలాలు విజయవాడ రూరల్ మండలం దాటకపోవటంతో అధికారులు భలేరావు చెరువుకు గండికొట్టారు. దీంతో 350 ఎకరాల విస్తీర్ణం చెరువు ఖాళీ అయింది. చెరువు కింద 750 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు కాలువకు పూర్తిస్థాయిలో నీరు వస్తే చెరువు కింద పొలాలు ముంపుబారిన పడతాయని వాపోతున్నారు. ప్రస్తుతం సాగుకు నీరు లేక, గోదావరి జలాలు రాక రెండింటికి చెడ్డామని రైతులు ఆందోళన చెందుతున్నారు.