హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న పోలీసు సిబ్బంది, నంబరు ప్లేటుపై నంబరుకు బదులుగా పోలీస్ అని రాసిన దృశ్యం
సాక్షి, నెల్లూరు(క్రైమ్): ‘వాహనాలు నడిపే వ్యక్తులు హెల్మెట్ ధరించాలి. అందరూ విధిగా నిబంధనల మేరకు వాహనాలకు నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలి. ట్రాఫిక్ రూల్స్‌ను ఎవరూ ఉల్లంఘించినా ఉపేక్షించం’ చెబుతున్న పోలీసులు పౌరులకు భారీగా జరిమానా విధిస్తున్నారు. కానీ ఆ రూల్స్‌ను మాత్రం పోలీసులే బ్రేక్ చేస్తున్నారు. నిబంధనలు ఎదుటి వారికే కానీ.. తమకు కాదంటున్నారు. సాక్షాత్ జిల్లా పోలీసు బాస్ హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలు తమకు ఒకలా? పోలీసు సిబ్బందికి మరోలా ఉంటాయా అంటూ జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారు.
మృతుల్లో అధిక శాతం మంది ద్విచక్ర వాహన చోదకులే. ప్రమాదంలో తలకు తీవ్రగాయమై మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. మితిమీరిన వేగం, నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ ధరించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా గుర్తించి వాటిని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గతేడాది డిసెంబర్ నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పోలీసు సిబ్బంది నిత్యం రహదారులపై మాటేసి ఉల్లంఘనల పేరిట వాహన చోదకులపై ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 1,35,212 కేసులు నమోదు చేసి సుమారు రూ.2 కోట్ల మేర జరిమానాలు విధించారు. మరికొందరు పోలీసు సిబ్బంది నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
హెల్మెట్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్స్ ఉంటే పొల్యూషన్ లేదని, అన్నీ ఉంటే మితిమీరిన వేగం అని, ఏదో ఒకటి సాకుగా చూపిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. పలువురు వాహన చోదకులు ఇదేమిటని ప్రశ్నిస్తే వారిపై అదనంగా మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా నంబరు ప్లేట్లు సరిగా లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ కేసులు నమోదు చేసే ఖాకీలు మాత్రం యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. నిబంధనలు ఎదుటి వారికే కాని తమకు కాదన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
ఎస్పీ హెచ్చరికలు బేఖాతర్
నిబంధనల అమలు సొంత ఇంటి నుంచే జరిగి అందరికీ మార్గదర్శకులుగా నిలవా లని ఎస్పీ భావించారు. అందులో భాగంగా గతేడాది డిసెంబర్ మొదటి వారంలో జిల్లాలో పనిచేస్తూ ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్న సిబ్బంది అందరూ విధిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయరాదని ఆదేశించారు. వీటిని పాటించని వారికి ఆబ్సెంట్ వేస్తామని హెచ్చరించారు. సిబ్బంది అందరూ విధిగా హెల్మెట్ ధరిస్తున్నారో లేదో పరీక్షించి ప్రతి రోజు నివేదిక అందజేయాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
కొద్ది రోజులు సిబ్బంది ఎస్పీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. కాలక్రమేణా హెచ్చరికలను బేఖాతరు చూస్తూ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. అధికారులు సైతం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద జిల్లా పోలీసుల తీరు చట్టాలు, నిబంధనలకు తాము అతీతులమని తమ చేష్టల ద్వారా నిరూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment