పోలీసులు ప్రజాసేవకులు
Published Sun, Sep 8 2013 2:53 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఒకప్పుడు మీరంతా ప్రజల్లో ఒకరని, ఇప్పుడు మాత్రం ప్రజా సేవకులన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అడిషనల్ డీజీపీ ఎన్.వి.సురేంద్రబాబు శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు సూచించారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండ్యాంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న 243 మంది కానిస్టేబుళ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో గౌరవంతో కూడుకున్నదన్నారు.
ప్రజల్లో గౌరవాన్ని తెచ్చిపెట్టే ఈ ఉద్యోగం సంపాదించడం అదృష్టంగా భావిం చాలన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా పోలీసుల వద్దకే వస్తారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యలను పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. నీతి నిజాయితీలతో ఉద్యోగం చేయడం ద్వారా ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం కలుగుతోందన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదని, ఉన్నత విద్యనభ్యసించినవారు ఇంకా మెరుగైన ఉద్యోగాలకు ప్రయత్నించాలన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్ల నైపుణ్యాన్ని పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్లకు అందజేస్తున్న శిక్షణపై ప్రిన్సిపాల్ సెంథిల్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిక్షణ కేంద్రం పరిసర ప్రాంతాలను, మెస్ నిర్వహణను పరిశీలించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, ఆర్‌ఐ టి.రమేష్, సీఐలు డి.మోహనరావు, ఎన్.సాయి, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.
మెరైన్ స్టేషన్ సందర్శన
గార : కళింగపట్నం మెరైన్ స్టేషన్‌ను అడిషనల్ డీజీపీ సురేంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా బోట్ల పరిస్థితులపై సంబంధిత సిబ్బంది నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీజిల్ ఎంత ఖర్చువుతోంది, సముద్రంలోకి ఎలా తీసుకెళ్తున్నారు తదితర వివరాలపై ఆరా తీశారు. సిబ్బంది సౌకర్యాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పీ నవీన్ గులాఠీ, డీఎస్పీ శ్రీనివాసరావు, మెరైన్ సీఐ పూరేటి నారాయణరావు పాల్గొన్నారు.
Advertisement