చంచల్‌గూడ జైలు వద్ద వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: చంచల్‌గూడ జైలు వద్ద వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధులు గట్టు గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్, హబీబ్ అబ్దుల్ రెహ్మాన్ సిపిని కలిశారు. తమ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నప్పటికీ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.
మహిళలని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహతంగా ప్రవర్తిస్తూ, అరెస్ట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్మోహన రెడ్డి ఎవరికీ వ్యతిరేకంకాదని వారు చెప్పారు. జగన్ దీక్షకు సంఘీభావం చెబుతున్నవారిని అడ్డుకోవడం తగదన్నారు. ధర్నాలు, నిరసనలు శాంతియుతంగా చేస్తున్నా పోలీసులు వివక్ష చూపుతున్నారని ఫిర్యాదు చేశారు.
జగన్ దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలపై ఉదయం పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. మహిళలతోపాటు 150 మంది నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, మూలా హరీష్‌గౌడ్, సుదర్శన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, శ్రీహరి, సురేష్‌గౌడ్, బాల్‌రెడ్డి, సుజాత, రంగారెడ్డి జిల్లా నేతలు అమృతసాగర్, సురేష్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్లు జనార్దన్‌రెడ్డి, కొలను శ్రీనివాసరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రాచమల్లు సిద్ధేశ్వర్, దేపా భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసయాదవ్, వడ్డేపల్లి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.