జరిమానాల జమానా | police ChallansTo People In YSR Kadapa | Sakshi
Sakshi News home page

జరిమానాల జమానా

Published Sat, Sep 22 2018 11:36 AM | Last Updated on Sat, Sep 22 2018 11:36 AM

police ChallansTo People In YSR Kadapa - Sakshi

వాహనాలు ఆపుతున్న పోలీసులతో వాగ్వాదం చేస్తున్న వాహనదారుడు

కడప కార్పొరేషన్‌: ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలకు ముకుతాడు వేయాల్సిందే. అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేస్తే జరిమానా వసూలు చేయాల్సిందే. మద్యం తాగి వాహనం నడిపితే మత్తు దించాల్సిందే...వీటిని ఎవరూ కాదనలేరు. అవగాహనతో కూడిన జరిమానాలు వేస్తే జనం హర్షిస్తారుగానీ  జరిమానాలే పరమావధి కాకూడదు. నెలలో ఇన్ని డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు పెట్టాలి, ఇన్ని చలానాలు రాయాలని ఒత్తిడి తెస్తుంటే పోలీసులు తమ టార్గెట్లు అందుకోవడానికి వక్రమార్గాలు అన్వేషిస్తున్నారు. తమ లక్ష్యసాధన కోసం  వైన్‌షాపుల వద్ద కాపుకాసి, మద్యం తాగి వాహనం ఎక్కే వారిని పట్టుకొని డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి వాటివల్లే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల నమోదులో వైఎస్‌ఆర్‌ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. 2016లో 1701 కేసులు పెట్టి రూ.2.52కోట్లు ఆదాయంఆర్జించిపెట్టిన ఆర్టీఏ, పోలీసు అధికారులు 2017 సంవత్సరంలో 6230 కేసులు పెట్టి రూ.7.43కోట్లు జరిమానాలు వేశారు. 2018లో కేవలం మూడు మాసాల్లోనే 7,208 కేసులు పెట్టి  రూ.6.43 కోట్లు ఫైన్లు వేశారంటే పోలీసుల ఉత్సాహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వం వద్ద, ఉన్నతాధికారుల వద్ద మెప్పు పొందడానికి ఇలా ప్రజల నడ్డి విరుస్తున్నారనేది ఈ లెక్కల ద్వారా తేటతెల్లమవుతోంది.కడప నగరానికి సిటీ కల్చర్‌ ఇంకా అలవాటు కాలేదు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వేలాదిమంది ప్రజలు నిత్యం కూలీ పనుల నిమిత్తం  వచ్చి రాత్రికి ఇంటికెళ్లిపోతుంటారు. వారికి ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన ఉండదు కాబట్టి అలాంటి వారే ఈ కేసుల్లో ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం మద్యాన్ని హెల్త్‌ డ్రింగ్‌గా ప్రచారం చేస్తూ ఏరులై పారిస్తోంది. విచ్చలవిడిగా మద్యం లైసెన్సులు ఇచ్చి ఎక్సైజ్‌ శాఖకు టార్గెట్‌(లక్ష్యం) విధించి మద్యం ద్వారా ఆదాయం సంపాదిస్తోంది. ఇదే క్రమంలో ఆర్‌టీఏ, పోలీసు శాఖలకు కూడా నెలకు ఇన్ని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు, ఈ చలానాలు వేయాలని  టార్గెట్లు విధిస్తున్నారు. ఇవిగాక రాంగ్‌ పార్కింగ్, సెల్‌ఫోన్‌  డ్రైవింగ్, త్రిబుల్‌ రైడింగ్, హెల్మెట్‌ ధరించకపోవడం, సీట్‌ బెల్టు పెట్టుకోకపోవడం వంటి వాటిపై కెమెరాలతో రికార్డు చేసి  పోలీసులు చలానాలు వేస్తున్నారు. వీటి వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుండటంతో ఎక్కువ టార్గెట్లు పెట్టి నెలనెలా సమీక్షలు నిర్వహించి వాహనదారులను జేబులు ఖాళీ చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ రహదారుల్లో వాహనాలు వేగంగా Ðð వెళ్తుంటాయి కాబట్టి  ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని  చలానాలు వేస్తే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడానికే ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు. నగరాలు, పట్టణాల్లో ఉండే ట్రాఫిక్‌కు 20–30 కిలోమీటర్లు స్పీడ్‌ వెళ్లలేని చోట కూడా ఫైన్లు వేయడమంటే ఆదాయం పెంచుకోవడానికిగాక మరేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

సౌకర్యాలు అరకొరే... అయినా
జిల్లాలోని పట్టణాల్లో ఇప్పటికీ మెరుగైన రోడ్డు సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు, ట్రాఫిక్‌ పో లీసులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, పార్కింగ్‌ స్థలాల ఏర్పాటు వంటి వాటిని ఎప్పుడో మర్చిపోయారు. ఫైన్లు వేయడమే వారికి పరమావధిగా మారిపోయింది. విదేశాల్లో అయితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేనిదే వాహనం విక్రయించేందుకు అవకాశం ఉండదు. కానీ ఇక్కడ లైసెన్స్‌ లేకపోయినా యథేచ్ఛగా వాహనాలు విక్రయించవచ్చు. దీంతో లక్షల సం ఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి.వీటికి  సరిపడా రోడ్లు విస్తరణ కాలేదు సరికదా అటూ, ఇటూ గుంతలతో ఇబ్బందులు తప్పడం లేదు. మద్యాన్ని ఏరులై పారించమని ఎక్సైజ్‌ శాఖకు, ఫైన్లు వేయమని ఆర్‌టీఏ, పోలీసుశాఖకు,  కేసులు రాయాలని విద్యుత్‌ శాఖకు, పన్నులు పెంచుకోవాలని మున్సిపాలిటీలకు లక్ష్యాలు(టార్గెట్లు) విధించి వసూళ్లు చేస్తున్న ప్రభుత్వం పెరుగుతున్న పెట్రో«ల్, గ్యాస్‌ «ధరలు, నిత్యావసర ధరలకు కళ్లెం వేయడంలో ఈ టార్గెట్లు పెట్టకపోవడం పట్ల ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

లక్షల్లో్ల పేరుకుపోయిన బకాయిలు
ఈ చలానా వేసిన 15 రోజుల్లోపు రుసుం చెల్లించాలి. 16వ రోజు నుంచి పెండింగ్‌లోకి వెళ్లిపోతుంది. అదే వాహనానికి రెండోసారి ఈ చలానా వస్తే.. మొదటిసారి పెండింగ్‌లో ఉన్న రుసుం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్‌లాంటి నగరాల్లో అయితే ఈ చలానా ద్వారా ఫైన్‌ వేసిన విషయం ఫోన్‌ నంబర్లకు మెసేజ్‌ వస్తుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడంతో వాహనదారులకు తమకు ఈ చలానాలో జరిమానా వి«ధించారన్న విషయం పోలీసులు ఆపినప్పుడుగానీ తెలియడం లేదు. దీంతో ఈ చలా నా బకాయిలు లక్షల్లో పేరుకుపోయినట్లు సమాచారం. వాటిని వసూలు చేయడానికి ఒక వాహ నం, ఏఎస్‌ఐ, ముగ్గరు కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా ఒక బృందాన్ని కేటాయించి వసూళ్లు చేస్తున్నారు. తెల్లారి లేచింది మొదలు వీరికి చలానాలు
రాబట్టడమే పని.  ఈ చలానాలో వారి బండినంబర్లు తనిఖీ చేయడం, వాహనం తమ వద్దనే ఉంచుకొని డబ్బులు కట్టి రసీదు తీసుకురమ్మని చెప్పడం నిత్యకృత్యంగా మారింది. సా ధారణంగా  రెండు, మూడుసార్లు ఈ చలానా డబ్బు చెల్లించకపోతే ఆ వాహనం కనిపిస్తే పోలీసులు సీజ్‌ చేస్తారు. కానీ కడపలో పోలీసులు మా త్రం ఒకసారి చెల్లించకపోయినా  వాహనం ఆపి, దాన్ని వారి వద్దనే ఉంచుకొని డబ్బు కట్టి రమ్మని చెబుతున్నారు. అతని వద్ద డబ్బు ఉందా, లేదా అప్పటికప్పుడు కట్టమంటే ఏం చేస్తాడన్న ఆలోచ న లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ చలానా వేసిన విషయం నాకు తెలీదు, రేపు చెల్లిస్తానని  చెప్పినా వినిపించుకోకపోవడంతో వాహనదారులు ఇదేం న్యాయం, ఇప్పటికిప్పుడు చెల్లించమంటే ఎలా అని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు.

అపరాధ రుసుములు ఇలా...
మోటారు వెహికల్‌ యాక్టు కింద నిబంధనలు ఉల్లంఘించిన అన్ని రకాల వాహనాలకు కింద చూపిన విధంగా అపరాధ రుసుము విధించే అవకాశం ఉంది. లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ. 500, రిజిస్ట్రేషన్‌ లేకుంటే రూ. 2వేలు, ఇన్సూరెన్స్‌ లేకపోతే రూ.1000, మైనర్‌ డ్రైవింగ్‌కు రూ.500, వన్‌వే, నో ఎంట్రీలో ప్రవేశిస్తే రూ.200, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోతే రూ.2వేలు, హెల్మెట్‌ ధరించకపోతే రూ.100, దివ్యాంగులు అనుమతి లేకుండా ద్విచక్రవాహనం నడిపితే రూ.200, ర్యాష్‌ డ్రైవింగ్‌కు రూ.1000, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.1000, హారన్‌ లేకపోతే రూ.100, లైన్‌ క్రాసింగ్‌కు రూ.100, సిగ్నల్‌ జంపింగ్‌కు రూ.1000, సిగరెట్‌ త్రాగుతూ డ్రైవింగ్‌ చేస్తే రూ.100,  ట్రిపుల్‌ రైడింగ్‌కు రూ.1200, వాహన యజమానికి కాకుండా ఇతర వ్యక్తులు డ్రైవింగ్‌ చేస్తే రూ.1000, మితిమీరిన వేగానికి, భీమా లేకపోతే వెయ్యి రూపాయల చొప్పున అపరాధ రుసుము విధించే అవకాశం ఉంది. ప్రమాదకరంగా, ఇతరుల ప్రాణాలకు హాని  కలిగించే రీతిలో వాహనం నడిపినా, పర్మిట్‌ లేకపోయినా కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement