ప్రకాశం జిల్లా / కందుకూరు: పట్టణంలో సంచలనం రేపిన వృద్ధురాలు సోమేపల్లి లక్ష్మమ్మ (55) హత్య వెనుక దాగి ఉన్న మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇంట్లోనే అత్యంత దారుణంగా లక్ష్మమ్మను చంపిన అసలు నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నగల కోసమే హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు వలేటివారిపాలెం మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నగలకు సంబంధించిన సమాచారంతో పాటు, మరికొన్ని ఇతర వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. నేడో, రేపో నిందితుడికి సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు మరో హత్య కేసులో కూడా అతడే నిందితుడిగా తేలింది.
మరితం లోతుగా వెళ్తే..
పట్టణంలోని గుర్రంవారిపాలేనికి చెందిన సోమేపల్లి లక్ష్మమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. గత నెల 18వ తేదీ రాత్రి ఇంట్లోనే ఆమె అత్యంత దారుణ హత్యకు గురైంది. మరుసటి రోజు ఉదయం పక్క ఇంటి యువకుడు వచ్చి చూసే వరకు విషయం వెలుగులోకి రాలేదు. లక్ష్మమ్మను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? తెలిసిన వారు చేసిన పనా లేక దోపిడీ దొంగలు చేసిన హత్యా..వంటి అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ హత్యకు ముందు నాలుగైదు రోజుల నుంచి లక్ష్మమ్మ ఇంటికి పెయింటింగ్ వేయిస్తోంది. పెయింటింగ్ పని చేసేందుకు వచ్చిన వారు ఆమె ఒంటిపై ఉన్న నగల కోసం దారుణానికి పాల్పడి ఉంటారని తొలుత భావించారు.
మొదట్లో పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పనిచేసిన పెయింటర్లతో పాటు, పట్టణంలోని పలువురు పెయింటర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు దారుణానికి పాల్పడింది వారు కాదని విచారణలో తెలింది. మరో కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు అసలు దీనికి కారణం ఎవరనేది గుర్తించగలిగారు. వలేటివారిపాలెం మండలం నలదలపూరుకు చెందిన వ్యక్తి హత్యకు పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లక్ష్మమ్మ ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే హత్యకు పాల్పడినట్టు విచారణలో తేలినట్లు సమాచారం. నిందితుడు దొరికినా పోయిన నగలు ఇంకా రికవరీ కాకపోవడంతో పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది.
ఒంటరి మహిళలే టార్గెట్
నిందితుడు తెలివిగా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్య చేసి బంగారం దోచుకున్నట్లు తేలింది. మొదట నారాయణమ్మను హత్య చేసి ఆమె నగలు దోచుకున్నాడు. అది పోలీసుల వరకు వెళ్లకపోవడంతో ఎవరూ కనిపెట్టలేదు. ఈ ధైర్యంతోనే నలదలపూర్‌లో ఉండే చెల్లెలు ఇంటికి లక్ష్మమ్మ తరుచూ వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో లక్ష్మమ్మను గమనించిన నిందితుడు ఆమెను లక్ష్యంగా చేసుకుని హత్య చేసి బంగారం దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ హత్య వెనుకా అతడేనా?
లక్ష్మమ్మ హత్యకు మూడు నెలల ముందు పట్టణంలో మరో ఒంటరి మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పట్టణంలోని సంహాద్రినగర్‌లో కొల్లా నారాయణమ్మ అనే మహిళ ఇంట్లోనే నిర్జీవంగా పడి ఉంది. ఒంటిపై ఉన్న నగలు కూడా మాయమయ్యాయి. ఆమె బంధువులు ఇది సాధారణ మరణంగానే భావించి అంత్యక్రియలు చేశారు. ఇద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉండటం, ఒకే రీతిలో మరణం, నగలు మాయం వంటి సంఘటనతో నారాయణమ్మ కూడా హత్యకు గురై ఉంటుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులకు దొరికిన లక్ష్మమ్మ హంతకుడే నారాయణమ్మను కూడా హత్య చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.
సెల్‌ఫోన్ పట్టించిందా..
అత్యంత చాకచక్యంగా హత్యలకు పాల్పడిన నిందితుడు చేసిన పొరపాటే పోలీసులకు పట్టుబడేలా చేసింది. లక్ష్మమ్మ హత్యలో చిన్న క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. నారాయణమ్మ హత్యపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో నారాయణమ్మ హత్య జరిగి మూడు నెలలైనా ఇటీవల ఆమె ఇంటిని పోలీసులు పరిశీలించారు. ఇంట్లో ఓ ఫోన్ బాక్స్ దొరికింది. ఆ ఫోన్ బాక్స్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఆ ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించగలిగారు. ఆ ఫోన్ నలదలపూరులో ఉన్నట్లు తేల్చి నిందితుడిని గుర్తించినట్లు సమాచారం. నిందితుడు చేసిన ఆ చిన్న పొరపాటే పోలీసులకు చిక్కేలా చేసింది. మొత్తానికి ఓ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపడితే మరో హత్య కేసు నిందితుడిని కూడా గుర్తించగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment