పోలీస్‌ పహారాలో కొత్తపాలెం | Police Force in Kothapalem Guntur | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పహారాలో కొత్తపాలెం

Published Thu, Feb 21 2019 1:32 PM | Last Updated on Thu, Feb 21 2019 1:32 PM

Police Force in Kothapalem Guntur - Sakshi

వాహనాలను చెక్‌ చేస్తున్న పోలీసులు

గుంటూరు: వాహనాల సైరన్, పోలీసుల రాకపోకలతో మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న కొత్తపాలెం హడావుడిగా మారింది. కొండ ప్రాంతంలో నిత్యం పండ్లు, పూల తోటల పనుల్లో నిమగ్నమయ్యే గ్రామస్తులు గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలపై ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన నడుమ జీవిస్తున్నారు. మాకు ఇదేం ఖర్మరా బాబూ..అంటూ తలలు పట్టుకుంటున్నారు. పోలీస్‌ పహారాలో గ్రామం ఉండటంతో అసహనానికి గురవుతున్నారు.

తెల్లవారు జాము నుంచేఖాకీల హడావుడి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ బుధవారం కొత్తపాలెం గ్రామంలో పర్యటిస్తున్నట్లు తెలుసుకున్న పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. రాత్రికి రాత్రే రూరల్‌ జిల్లా పరిధిలోని పోలీసులను అప్రమత్తం చేసి తెల్లవారుజాముకు గ్రామానికి చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతం, అటు వైపు వెళ్లే మార్గాల్లో పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు. రెండు రోజుల అనంతరం మళ్లీ గ్రామంలోకి, గ్రామ ప్రధాన రహదారి వద్దకు వరుసగా పోలీసుల వాహనాలు వచ్చి నిలవడంతో ఏం జరిగిందోనని ఆందోళనలో పడ్డారు.

గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న ఖాకీలు
చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు అక్కడ జరిగే ప్రతి చిన్న విషయాన్ని సైతం సెల్‌ఫోన్‌లలో, పోలీసుల వద్ద ఉన్న బాడీవార్న్‌ కెమెరాలలో చిత్రీకరించారు. ఇంటెలిజెన్స్‌ సిబ్బంది అయితే మీడియా ప్రతినిధులను సైతం వీడియోలు తీసి ఉన్నతాధి కారులకు చేరవేశారంటే పరిస్థితిని అర్థ చేసుకోవచ్చు. ఫిరంగిపురం నుంచి కొండవీడు వెళ్లే ప్రధాన మార్గంలో ఫిరంగిపురం గ్రామ శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడ రాకపోకలు కొనసాగించే ప్రతి ఒక్కరినీ నిలువరించి వారి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో పాటు వివరాలు అడిగి తెలుసుకొని మరీ అనుమతిస్తున్నారు.కొండవీడు గ్రామం వద్ద, కొత్తపాలెం  వెళ్లే ప్రధాన రహదారి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు కొనసాగించారు. అదనపు ఎస్పీలు ఎస్‌.వరదరాజు, ప్రసాద్‌తో పాటు డీఎస్పీలు రవివర్మ, శ్రీహరిబాబు,  పోలీసుల ఏర్పాటు చేసిన క్యాంపు నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు, సిబ్బందికి సూచనలు జారీ చేశారు. పోలీసుల హడావుడి పెరగడంతో వ్యవసాయ పనులకు, వ్యక్తి గత పనులపై వెళ్లేవారు ఎన్నడూ లేని విధంగా రోడ్లుపై తనిఖీలు ఏంటంటూ అసహనం వ్యక్తం చేశారు.

నిజ నిర్ధారణకు అడుగడుగునా ఆటంకాలు
చిలకలూరిపేట/యడ్లపాడు: రైతు పిట్టల కోటేశ్వరరావు(కోటయ్య) మృతిపై ఏర్పాటైన వైఎస్సార్‌ సీపీ నిజ నిర్ధారణ కమిటీకి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. గుంటూరు జిల్లాలోని కొండవీడు ఉత్సవాల సందర్భంగా ఈనెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు సభ నిర్వహించారు. దీనికి ఏర్పాట్ల పేరుతో పోలీసులు ఓ బడుగు రైతు ప్రాణాలు బలి తీసుకున్న సంఘటన విదితమే. ఈ విషయమై శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి నేతృత్వంలోని కమిటీ బుధవారం కొత్తపాలెం గ్రామాన్ని సందర్శించి, మృతుడు కోటయ్య కుటుంబాన్ని కలసి వివరాలు సేకరించింది. కమిటీలోని సభ్యులైన ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొహమ్మద్‌ ముస్తఫా, వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి, నర్సరావుపేట, బాపట్ల, గుంటూరు అంబటి రాంబాబు, మోపిదేవి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి, నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త  విడదల రజని పలువురు పార్టీ నాయకులతో కలసి వచ్చారు.

జాతీయ రహదారి నుంచి బోయపాలెం మీదుగా కొత్తపాలేనికి వెళ్లేందుకు బయలుదేరిన నాయకులకు ఆదిలోనే పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా నిజ నిర్ధారణ చేసేందుకు వెళ్తుంటే ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించడంతో కొద్దిమందే ఉన్న పోలీసులు నాయకులను వెళ్లనిచ్చారు. తిరిగి కోట గ్రామం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా చేరుకున్న పోలీసులు పార్టీ నాయకుల వాహనాలను అడ్డుకున్నారు. ఈ దశలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కొలుసు పార్థసారథి తదితర నాయకులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విడదల రజని, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శాంతియుతంగా వెళుతున్న క్రమంలో అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల తీరు సరికాదంటూ..సమస్యను మీరే సృష్టిస్తున్నారని విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్ష వైఖరితో వాహనాలను అడ్డుకోవటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు వాహనాలను వదలి కాలినడకన ముందుకు సాగారు. కొండవీడు వరకు నడక కొనసాగించారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి నుంచి కొత్తపాలెం జంక్షన్‌కు „చేరుకుని గ్రామం వైపు, బైపాస్‌లో వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కొండవీడు వరకు కాలినడకన వచ్చిన నాయకులు పోలీసులు వెళ్లిపోయాక వచ్చిన తమ వాహనాల్లో ఎక్కిరాగా.. తిరిగి కొత్తపాలెం జంక్షన్‌ వద్ద అగ్ర నాయకుల వాహనాలను మాత్రం వదిలి పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement