సాక్షి, విశాఖపట్నం : మావోయిస్టు కోరుకొండ దళానికి గట్టి షాక్ తగిలింది. అనారోగ్యం వల్ల దళం నుంచి నిష్ర్కమించి, లొంగిపోయిన నలుగురు మిలిటెంట్లు నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. దాని ఆధారంగా దళంలోని మిగిలిన సభ్యులపై ఉక్కుపాదం మోపేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కూంబింగ్‌కు సన్నద్ధమవుతున్నారు. కోరుకొండ ఏరియా కమిటీలో కీలకంగా వ్యవహరించి నల్లమల,తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాం తాల్లో కమాండర్‌గా పనిచేసిన సంతోష్ అలియాస్ కొర్ర సత్తిబాబు, ఆయన భార్య సుజాత, మరో ఇద్దరు దళ సభ్యులు అనారోగ్యం కారణంగా పార్టీ నాయకత్వం అనుమతితో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోకుండా పో లీస్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి లొంగిపోయారు.
మరింత సమాచారం కోసం వారిని ప్రస్తుతం స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసు లు విచారిస్తున్నారు. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టిన ఉన్నతాధికారులు డాక్యుమెంటేషన్ ప్రక్రియ అనంతరం వారి లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు. సంతోష్‌ది గూడెం కొత్తవీధి మండలం ఎర్రగెడ్డ గ్రామం. నాలుగేళ్ల క్రితం దళంలో చేరాడు. పలు హింసాత్మక ఘటనలలో పాల్గొన్నాడు. సంతోష్‌పై రూ.4లక్షలు, సుజాతపై రూ.లక్ష రివార్డు ఉంది. వారి నుంచి లభించిన సమాచారంతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టుల దూకుడుకు ముకుతాడు వేసేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో సంసిద్ధమైనట్టు తెలిసింది.