తిరుపతి: స్మగ్లర్లపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఏడుగురు స్మగ్లర్లు చిక్కారు. ఇంకే ముంది.. పోలీసులు రెచ్చిపోయారు. తమ చేతిలో ఉన్న కర్రలకు పని చెప్పారు. దొరకడమే అదునుగా భావించిన పోలీసులు స్మగ్లర్లను చితకబాదారు. వారి బట్టలిప్పి మరీ చావబాదారు. స్మగ్లర్లను కిందపడేసిన పోలీసులు వారు చుట్టుముట్టి మూకుమ్ముడిగా దాడి చేశారు. గతవారం స్మగ్లర్ల కార్యకలాపాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఇద్దరు అధికారులను మట్టుబెట్టడంతో పోలీసులు కూంబింగ్ను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం ఏడుగురు స్మగ్లర్లు పోలీసులకు చిక్కడంతో వారిని చావబాదారు. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది.
ఎర్రచందనం దొంగలు - అటవీ, పోలీసు సిబ్బందికి మధ్య శనివారం కూడా పరస్పర దాడులు జరిగాయి. పోలీసులు ఒక దొంగను అదుపులోకి తీసుకుని విచారించగా ఒక బడా స్మగ్లర్ ఆచూకీ తెలిసింది. జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు వివిధ మార్గాల ద్వారా 145 మంది పోలీసులు అటవీ సిబ్బందితో కలిసి అడవుల్లో స్మగ్లర్లను గాలిస్తూ వెళ్లారు. తిరుపతి, భాకరాపేట, రేణిగుంట, కడప, రాజంపేట మీదుగా శేషాచలం అడవిలోకి చేరుకున్నారు. భాకరాపేట మీదుగా నామాల గుండుకు 9 కిలోమీటర్ల దూరంలో 15 మంది ఎర్రచందనం దొంగ కూలీలను పోలీసులు గుర్తించారు. వారు పోలీసులను చూడగానే రాళ్లతో దాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ రోజు పకడ్బందీగా కూంబింగ్ నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు కొంతమంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వారికి నరకం చూపించారు. ఇంత జరిగినా అటవీ శాఖ అధికారులు మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం.