పోలీస్ మార్క్ దాష్టీకం
పరిగి/హిందూపురం అర్బన్ : గ్రామం వదిలి వెళ్లిన వ్యక్తి హతమయ్యాడని భావించిన పోలీసులు.. చేయని నేరానికి ముగ్గురు అమాయకుల్ని చిత్ర హింసలు పెట్టి జైలుపాలు చేశారు. హతమయ్యాడనుకున్న వ్యక్తి బుధవారం ప్రత్యక్షం కావడంతో పోలీసులు దాష్టీకం వెలుగు చూసింది. ఈ విషయాన్ని బాధితులు గురువారం బయటపెట్టి కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రత్యక్షమైన ఆ వ్యక్తిని హిందూపురం కోర్టుకు గ్రామస్తుల సమక్షంలో తీసుకొచ్చి జడ్జికి అప్పగించి తమకు జరిగిన దారుణాన్ని, అవమానాన్ని వివరించారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2013 మార్చి 28న పరిగి మండల పరిధిలోని కోనాపురం గ్రామ సమీపంలోగుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. పది నెలల అనంతర ం అదే గ్రామానికి చెందిన దాళప్ప(48) హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ(సత్తి), నరసింహమూర్తి, జిక్రియాను అనుమానితులుగా పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పటి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ ఆ ముగ్గురినీ స్టేషనుకు పిలిపించారు. నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారు. తమకేమీ తెలీదు.. మొర్రో.. అంటున్నా వినకుండా.. ఏడుగురు పోలీసులతో ఏకధాటిగా అత్యంత పాశవికంగా ఒళ్లంతా కుళ్లబొడిపించారు. చావు దెబ్బలకు తాళలేక.. ఆయాసంతో దాహం వేస్తే... నీళ్లు అడిగిన పాపానికి.. మూత్రం పోశాడని ఓ బాధితుడు విలపించాడు. అంతటితో ఆగక రాత్రి సమయాల్లో స్టేషన్లు మారుస్తూ హత్య చేసినట్లు అంగీకరించాలంటూ కరెంటు షాకులిచ్చారని రోదించారు. అప్పటికీ తాము ఒప్పుకోక పోవడంతో అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించి, చిత్రహింసలకు గురి చేశారని వాపోయారు. ఆయన కిరాతక చర్యలు తట్టుకోలేక చేయని నేరాన్ని నెత్తికెత్తుకుని జైలుపాలయ్యామని బోరున విలపించారు.
తాము 40 రోజులు రిమాండ్‌లో ఉంటూ జైలు జీవితం అనుభవించామన్నారు. ఈ కేసులో అత్యుత్సాహంతో పోలీసులు తమను బలి పశువులు చేశారని, అప్పట్నుంచి గ్రామంలో తమను నిందితులుగా చిన్నచూపు చూస్తున్నారన్నారు. తమ పిల్లలు పాఠశాలలకు వెళ్తే.. మీ తండ్రులు హంతకులని తోటి విద్యార్థులచే అవమానాల పాలయ్యారని గోడుమన్నారు. వారి హింసలతో పనులు చేసుకోవాలన్నా శరీరం, ఇతర అవయవాలు సహకరించడం లేదని రోదించారు. తమకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. తమపై తప్పుడు కేసు బనాయించి జైలుపాలు చేసిన సదరు ఎస్‌ఐను సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.