చిత్తూరులో పోలీసుల పైశాచికం | Police Over Action In Chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరులో పోలీసుల పైశాచికం

Published Tue, Feb 26 2019 2:11 AM | Last Updated on Tue, Feb 26 2019 8:06 AM

Police Over Action In Chittoor - Sakshi

ఎమ్మెల్యే చెవిరెడ్డి సతీమణి లక్ష్మిని బలవంతంగా అరెస్టు చేస్తున్న పోలీసులు

సాక్షి, తిరుపతి/తిరుపతి సెంట్రల్‌ : ఓట్ల దొంగలను పట్టించిన పాపానికి ఓ ప్రజాప్రతినిధిపై పోలీసులు దాష్టీకానికి తెగబడ్డారు. ఫిర్యాదు చేసిన గ్రామస్తులపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ ఆందోళన చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపైనా అక్రమ కేసులు నమోదుచేసి అరెస్టుచేశారు. అంతటితో ఆగని పోలీసులు అతనిని గుర్తుతెలియని ప్రదేశానికి తరలించేందుకు ఆదివారం రాత్రంతా తమిళనాడు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తిప్పారు. తిండి, నీరు ఇవ్వకపోవటంతో ఎమ్మెల్యేకి బీపీ పెరిగింది. ఒక్క బీపీ టాబ్లెట్‌ ఇవ్వమని ఎంత ప్రాథేయపడ్డా పోలీసులు కనికరించలేదు. ఈ వ్యవహారం దావానలంలా వ్యాపించడంతో గత్యంతరంలేక సోమవారం ఉదయం చెవిరెడ్డిని సత్యవేడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే, పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే పోలీస్‌స్టేషన్లోనే నిరశనకు పూనుకున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్య జనం పెద్దఎత్తున ధర్నా, రాస్తారోకోలు చేశారు. అలాగే, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి గ్రామస్తులతో కలిసి చిత్తూరు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. వారిని కూడా అరెస్టుచేశారు. 

అసలేం జరిగింది?
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి పరిధిలో గత కొద్దిరోజులుగా గుర్తుతెలియని యువకులు సర్వే పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వివరాలు చెప్పిన వారి పేర్లను ట్యాబ్‌లో నమోదు చేస్తుండడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి యువకులను ప్రశ్నించి పోలీసులకు అప్పగించారు. అలా అప్పగించిన ఎర్రావారిపాలెం మండలానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, రామాంజనేయులను శుక్రవారం అరెస్టు చేశారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి గ్రామంలోకి ప్రవేశించి వారి కుటుంబాలపై దాడులు చేసి గాయాలపాల్జేశారు. అనంతరం ఆదివారం కూడా పాకాల మండలంలో ఓట్ల దొంగలు సర్వే పేరుతో గ్రామాల్లో పర్యటిస్తుండడంతో గ్రామస్తులు అడ్డుకుని వారిని పోలీసులకు అప్పగించారు. ఇలా అప్పగించిన నంగా నరేష్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, ప్రకాష్‌రెడ్డిని కూడా పోలీసులు ఆదివారం అరెస్టుచేశారు. వీరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లకుండా చిత్తూరులోని పోలీసు శిక్షణా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వారిని చిత్రహింసలు పెట్టినట్లు బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చిత్తూరులోని ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అరెస్టుచేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంతకీ వారిని విడిచిపెట్టకపోవడంతో చెవిరెడ్డి ఆందోళనకు దిగారు.
సత్యవేడులో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి 

ఎమ్మెల్యే అరెస్టు
ఆందోళన చేస్తున్న చెవిరెడ్డిని ఆదివారం అర్ధరాత్రి చిత్తూరులో పోలీసులు బలవంతంగా అరెస్టుచేశారు. అయితే, స్టేషన్‌కు తరలించకుండా పోలీసు వాహనంలోనే తనను రాత్రంతా తిప్పారని ఆయన ఆరోపించారు. ఆయన వెంట గన్‌మెన్లు, పీఏ ఎవరినీ రానివ్వలేదు. ఎమ్మెల్యే వాహనాలను గంటన్నర పాటు చిత్తూరు నుంచి కదలనివ్వలేదు. కాగా, రాత్రి ఆహారం లేకపోవడంతో బీపీ పెరిగిందని.. ట్యాబ్లెట్‌ కావాలని బతిమాలినా పోలీసులు కనికరించకుండా సోమవారం ఉ.4.30 గంటల ప్రాంతంలో సత్యవేడు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారన్నారు. ఎమ్మెల్యేపై సెక్షన్‌–353, 183, 141తో పాటు 149 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు
అక్రమ అరెస్టుల విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు, మహిళలు చిత్తూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. జిల్లావ్యాప్తంగా కూడా సోమవారం ఆందోళనలు మిన్నంటాయి. గ్రామస్తులతో చిత్తూరులో ధర్నాకు దిగిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భార్య లక్ష్మీదేవి, కుమారులు మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డిలను పోలీసులు అరెస్టుచేశారు. ఎమ్మెల్యే భార్యను తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఇద్దరు కుమారులను యాదమర్రి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.

పోలీస్‌స్టేషన్‌లోనే చెవిరెడ్డి నిరాహారదీక్ష
పోలీసుల వైఖరికి నిరసనగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి సత్యవేడు పోలీస్‌స్టేషన్‌లోనే నీళ్లు సైతం తాగకుండా నిరాహారదీక్షకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సత్యవేడు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. డీఐజీ, ఎస్పీలకు ఫోన్‌చేసి ఎమ్మెల్యేని విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు. అయినా పోలీసులు పట్టించుకోకుండా వచ్చిన వారిని అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఇది తెలుసుకుని సత్యవేడుకు చేరుకునేందుకు యత్నించిన  పార్టీ కార్యకర్తలు, నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అనుమానం వచ్చిన వారిని అరెస్టు చేయడం ప్రారంభించారు. మరోవైపు చెవిరెడ్డికి సోమవారం సాయంత్రం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. 

టీడీపీకి మూల్యం తప్పదు : భూమన
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నిర్భంధించినందుకు టీడీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రగిరిని ఫ్యాక్షన్‌కు పుట్టినిల్లులా మార్చాలని టీడీపీ చూస్తోందని ధ్వజమెత్తారు. చెవిరెడ్డిని జైలుకు పంపేందుకు టీడీపీ ఉద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తోందన్నారు. పనిగట్టుకుని దొంగ ఓట్లను ఎక్కించడం, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని అడ్డుకున్న తమ పార్టీ కార్యకర్తలను...పోలీసులు ఇష్టమొచ్చినట్టు కొట్టి, నిర్భందించారన్నారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు భూమన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement