సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లనే టీడీపీ నేతల ప్రోద్భలంతో అధికారులు టార్గెట్ చేస్తున్నారని, చంద్రగిరి నియోజకవర్గంలో వేల కొద్ది ఓట్లు తొలగించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఓటర్ల అనుమతి లేకుండా ఓట్లను తొలగించారని, ప్రజాస్వామిక చరిత్రలో ఇంత దారుణంగా ఎక్కడా జరగలేదని వాపోయారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం చాలా ఘోరంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో సెల్ఫ్ డిక్లరేషన్ పేరిట ఓట్లు తొలగించడం సిగ్గు చేటన్నారు. అధికారులు టీడీపీ నేతలు చెప్పినట్లు ఓట్లు తొలగించారన్నారు. ఓట్లను అక్రమంగా తొలగిస్తున్న దాన్ని స్వయంగా వీడియో ఆధారంగా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన మీద రెక్కి నిర్వహించిన వారిని పోలీసులు వదిలేశారని చెప్పారు. ఓటర్ల అనుమతి లేకుండా ఓట్లు తొలగించడం మీద తాను లీగల్ నోటీసులు ఇస్తున్నానని, అధికారులకు నోటీసులు పంపిస్తున్నానని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగించారన్నారు. అక్రమంగా ఓట్లు తొలగించి గ్రామాల్లో చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఇంత దారుణంగా వ్యవహరిస్తుందా.. వారికి అధికారులు ఎలా సహకరిస్తారంటూ మండిపడ్డారు. ఓటర్ల తొలగింపుకు కారకులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment