
అప్పిరెడ్డి నివాసం వద్ద ధర్నాకు దిగిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
సాక్షి, గుంటూరు: అక్రమ లాకౌట్‌ను నిరసిస్తూ భజరంగ్ జూట్ మిల్లు కార్మికులు శాంతియుతంగా చేపట్టిన సామూహిక ఆమరణ నిరాహార దీక్షపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గుంటూరులోని భజరంగ్ జూట్ మిల్లును లాకౌట్ చేసి మూడేళ్లు గడిచినా పట్టించుకోని యాజమాన్య, ప్రభుత్వ వైఖరికి నిరసనగా గుంటూరు నగరం పట్టాభిపురంలోని జూట్ మిల్లు వద్ద బుధవారం కార్మికులు చేపట్టిన సామూహిక ఆమరణ నిరాహార దీక్షను బుధవారం మధ్యాహ్నం పోలీసులు భగ్నం చేశారు. ఏఎస్పీ వైటీ నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు.. దీక్షలో ఉన్న కార్మికులను అరెస్టు చేశారు. కార్మిక, వామపక్షాల నేతలను వాహనాల్లో ఎక్కించుకుని నగరంలోని పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్‌లను తొలగించారు.
శాంతియుతంగా దీక్ష చేసుకుంటున్న వారిపై పోలీసులు విరుచుకుపడి దీక్షను భగ్నం చేయడంపై కార్మికులు మండిపడ్డారు. పోలీసుల జులుం నశించాలి, కార్మిక వ్యతిరేక టీడీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ కార్మికులు, వామపక్ష నేతలు నినాదాలు చేశారు. చంద్రబాబు పాలనలో కార్మికులకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం 2015 అక్టోబర్ 2వ తేదీన గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా భజరంగ్ జూట్ మిల్లు అక్రమ లాకౌట్‌ను ఎత్తివేసి, మిల్లును ప్రారంభిస్తానని వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇది జరిగి మూడేళ్లయినా పట్టించుకోవడం లేదని మిల్లు కార్మికులు మండిపడ్డారు. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ కార్మికులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, యాజమాన్యంతో లాలూచి పడి పట్టించుకోవడం లేదని, వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పిరెడ్డి గృహ నిర్బంధం.. నేతల పరామర్శ తొలి నుంచీ కార్మికులకు మద్దతుగా నిలుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు, జూట్ మిల్లు పరిరక్షణ కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిని దీక్షకు సంఘీభావం తెలుపనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన నివసిస్తున్న గోల్డెన్ హోమ్స్ అపార్టుమెంట్ చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి గృహ నిర్బంధం చేశారు.
ఈ విషయం తెలియగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులు, పార్టీనేతలు, జూట్ మిల్లు కార్మికులు పెద్ద సంఖ్యలో గోల్డెన్ హోమ్స్ అపార్టుమెంట్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి, తమ నేతను వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. బుధవారం రాత్రి వరకూ అప్పిరెడ్డి గృహ నిర్బంధం కొనసాగింది. కార్మికుల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి భవన్నారాయణ తదితర వామపక్ష నేతలతో పాటు.. వైఎస్సార్‌సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, పార్టీ నేతలు కావటి మనోహర్‌నాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు, కత్తెర హెనీక్రిస్టీనా, నందిగం సురేష్ తదితరులు అప్పిరెడ్డిని పరామర్శించారు. కాగా, వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, అంబటి రాంబాబు అప్పిరెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు.