ఖాకీ క్రౌర్యం | Police Over Action on Kurnool farmers | Sakshi
Sakshi News home page

ఖాకీ క్రౌర్యం

Published Sun, Nov 18 2018 11:28 AM | Last Updated on Sun, Nov 18 2018 11:28 AM

Police Over Action on Kurnool  farmers - Sakshi

కాటసాని రామిరెడ్డిని ఎత్తుకెళ్తున్న దృశ్యం

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పంటలకు గిట్టుబాటు ధరలు, కేసీ కెనాల్, ఎల్‌ఎల్‌సీ, తెలుగుగంగ ఆయకట్టులో రెండు కార్లకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శనివారం జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని ముట్టడించిన వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. జెడ్పీ ఎదుట శాంతియుతంగా రాస్తారోకో చేస్తున్న నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉద్యమకారుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పలువురు నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. మహిళలు, అయ్యప్ప, సాయిబాబా మాలధారులను సైతం ఈడ్చేయడంతో అనేకమందికి రక్త గాయాలయ్యాయి.  

మెరువు వేగంతో జెడ్పీకి.. 
వైఎస్సార్‌సీపీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు, బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్తలు హఫీజ్‌ఖాన్, కాటసాని రామిరెడ్డి, నంద్యాల, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నేతలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు, మహిళలు, రైతులు జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని పురస్కరించుకొని ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు, బిర్లాగేటు, బళ్లారి రోడ్డులో మాటు వేశారు. 

అయితే.. నాయకులు చాకచక్యంగా వ్యవహరించారు. ముందుగా కార్యకర్తలను పంపారు. తర్వాత నాయకులు స్కూటర్లు, ఆటోల్లో పోలీసులకు మస్కాగొట్టి జెడ్పీకి మెరుపు వేగంతో చేరుకొని రాస్తారోకోకు దిగారు. టమాటాలు రోడ్డుపై పారబోసి.. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని, ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని, కాలువల కింద రెండో పంటకు నీరివ్వాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. 

ఖాకీల కర్కశం 
ఆందోళనకు దిగిన ఐదు నిమిషాల్లోనే అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. దీంతో పోలీసులు,  ఉద్యమకారుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రామిరెడ్డి, ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, గంగుల నాని, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, చెరుకులపాడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మంత్రాలయం వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డితో పాటు వందలాది మంది నాయకులు, కార్యకర్తలను డీఎస్పీ యుగంధర్‌బాబు నేతృత్వంలో బలవంతంగా అరెస్టు చేశారు. 

ఈ క్రమంలో మానవత్వం లేకుండా ప్రవర్తించారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న బీవై రామయ్యను ఈడ్చుకెళ్లడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. రోడ్డుపైనే పడిపోయి ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. పార్టీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి సాయిబాబా మాలధారణలో ఉన్నప్పటికీ బలవంతంగా తీసుకెళ్లి వ్యాన్‌లో పడేశారు. దీంతో ఆయన కూడా అస్వస్థతకు గురయ్యారు. నాయకురాళ్లను సైతం ఈడ్చుకుంటూ వెళ్లడంతో జమీల, విజయలక్ష్మీ, శౌరీ విజయకుమారి, సలోమిలకు రక్తగాయాలయ్యాయి. రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి చొక్కా చించేశారు. పలువురిపై లాఠీ చార్జీ చేశారు. తోపులాటలో జమీలకు సంబంధించిన బంగారు బ్రాస్‌లెట్, శౌరీ విజయకుమారికి చెందిన రూ.5 వేల నగదు పోయాయి. 

ప్రతిఘటించిన కార్యకర్తలు 
నేతలను అరెస్టు చేయడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. నాయకులను తీసుకెళ్తున్న వాహనానికి అడ్డుపడ్డారు. మూడంచెలుగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, ఎస్‌సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ మద్దయ్య, నాయకులు రెహమాన్, అదిమోహన్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, పలువురు కార్యకర్తలు జెడ్పీ సమావేశానికి వస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. వీరిపైనా పోలీసులు విచక్షణా రహితంగా లాఠీచార్జీ చేసి.. అనంతరం అరెస్టు చేశారు. సీహెచ్‌ మద్దయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ ఎదుట కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. మొక్కజొన్న, ఉల్లిగడ్డలను పారబోసి అన్నదాతకు అండగా ఉన్న వారిని అరెస్టు చేస్తారా అంటూ నిలదీశారు. 

సొంత పూచీకత్తుతో విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా, అంతకముందు నాయకులను రిమాండ్‌కు పంపాలని పోలీసులు భావించారు. అయితే.. తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకరరెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌరుచరితారెడ్డి, ఐజయ్య పొడియం ముందు బైఠాయించడంతో వెనక్కి తగ్గారు. అనంతరం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఉన్న డిప్యూటీ సీఎంకు జిల్లా రైతాంగ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 

కార్యక్రమంలో గుండం సూర్యప్రకాష్‌రెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, శిల్పా భువనేశ్వరరెడ్డి, మధుసూదన్, చెరకుచెర్ల రఘురామయ్య, ఆదిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నాగరాజుయాదవ్, అక్కిమి అనుమంతరెడ్డి, చంద్రమౌళి, పొలూరు భాస్కరరెడ్డి, మణివర్ధన్‌రెడ్డి, రైల్వే ప్రసాద్, గోపాల్‌రెడ్డి, శివశంకర్‌నాయుడు, మహేశ్వరరెడ్డి, కొంతలపాడు శ్రీనివాసరెడ్డి, కరుణాకరరెడ్డి, డీకే రాజశేఖర్, పురుషోత్తమరెడ్డి, గోపాల్‌రెడ్డి(ఆదోని), సిద్ధారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రమణారెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, మిడ్డూరు శ్రీనివాసులు, మహిళా నాయకులు మదారపు రేణుకమ్మ, సలోమి, సఫియాఖాతూన్, మంజుశ్రీ,, నంద్యాలకు చెందిన ఉసేనమ్మ, రాజ్యలక్ష్మీ, బేగం, మద్దమ్మ, మరియమ్మ, లక్ష్మీదేవి, సుచరిత తదితరులు పాల్గొన్నారు.  

రెండో పంటకు నీరివ్వాలి 
ఈ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. శ్రీశైలంలోకి 854 అడుగులు నీరు రాకముందే ఇతర జిల్లాలకు తరలించుకుపోతున్నారు. ఇక్కడ రైతులకు మాత్రం ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పడం దారుణం. కేసీ కెనాల్, ఎల్‌ఎల్‌సీ, తెలుగుగంగ కింద డిసెంబర్‌ వరకు మొదటి కారు పంటకే నీళ్లు ఇవ్వకపోతే అన్నదాతల గోడు ఎవరికీ చెప్పుకోవాలి? రెండు పంటలకు నీరివ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం. వైఎస్సార్‌ హయాంలో జిల్లాలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్, ముచ్చుమర్రి, సిద్దాపురం, గురురాఘవేంద్ర, పులికనుమ తదితర ప్రాజెక్టులను నిర్మించారు. కానీ, ఈ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టూ చేపట్టలేదు. తీవ్ర వర్షాభావంతో అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది. అయినా సర్కారులో చలనం లేదు.             
– శిల్పా చక్రపాణిరెడ్డి 

గిట్టుబాటు ధరలు లేకనే అన్నదాత ఆత్మహత్యలు 
తీవ్ర వర్షాభావం వల్ల అరకొర పంటలే పడుతున్నాయి. వీటికి కూడా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎకరా పంటకు రూ.50 వేల వరకు పెట్టుబడులు వస్తున్నా.. పండిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు లేవు. మార్కెట్‌లో కేజీ ఉల్లి మూడు, కేజీ టమాటాలు రెండు రూపాయలు, మొక్కజొన్న, వరికి క్వింటాల్‌కు రూ.1750 కనీస మద్దతు ధర ఉంటే రూ.1,200లకు మాత్రమే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. 
– బీవై రామయ్య 

ఎకరాకు రూ.25 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలి 
జిల్లాలో తీవ్ర కరువు నెలకొన్నా.. సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కేవలం కరువు మండలాలను ప్రకటించి చేతులు దులిపేసుకుంది. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి.  
– కాటసాని రాంభూపాల్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement