ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కంచిలి మండలం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది బూత్ కన్వీనర్లు, గ్రామస్థాయి నేతలపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తహసీల్దార్ టీబీ శ్రీనివాస్ ఓ ఫిర్యాదు చేశారు... దీంతో వారందర్నీ మంగళవారం సాయంత్రంలోగా పోలీసు స్టేషన్‌లో హాజరుకావాలంటూ పోలీసులు కబురు పంపారు... ఇంతకీ వారు చెప్పిందేమిటి?... ఓటర్ల జాబితాల్లో చోటుచేసుకున్న డబుల్ ఎంట్రీలపై దృష్టి పెట్టి సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని! కానీ పోలీసులు ఏమి చేస్తున్నారు?... ఓట్లను తొలగించడానికి దరఖాస్తులు చేశారు కాబట్టి కేసులు పెడుతున్నామని చెబుతున్నారు!
ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలం .. ఆదివారం వైఎస్సార్‌సీపీకి చెందిన 51 మంది బూత్ కన్వీనర్లు, నాయకులపై.. మంగళవారం మరో 12 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలు ఫారం–7తో తాము దరఖాస్తు చేయలేదని వారు చెబుతున్నా తహసీల్దార్ రఫీజాన్ ఫిర్యాదుతో ఈ యాక్షన్ చేస్తున్నారు. అసలు అక్రమంగా దరఖాస్తు చేసినవారెవ్వరో తెలియాలంటే వీరిపై కేసులు తప్పవని చెబుతున్నారు. కానీ వాస్తవమేమిటో తేటతెల్లం చేసే దిశగా దర్యాప్తు ఇప్పటివరకూ చేపట్టలేదని వైఎస్సార్‌పీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఆదేశంతోనే పోలీసులు ఓవరేక్షన్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ అభిమానుల ఓట్ల తొలగింపునకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్న టీడీపీ.. ఇప్పుడు పోలీసుల ద్వారా బుకాయింపునకు దిగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పై రెండు మండలాల్లోనే కాదు జిల్లావ్యాప్తంగా ఈ తరహా రివర్స్ కేసులే నమోదవుతున్నాయి. ఫారం–7 దరఖాస్తులతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని, కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారని నిందితులు ప్రశ్నిస్తున్నా ఫలితం ఉండట్లేదు. గత ఏడాది కాలంలో ఓటర్ల జాబితాల్లో నమోదవుతున్న డబుల్ ఎంట్రీలను తొలగించాలని, చనిపోయినవారి పేర్లను తీసేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు కోరుతూ వచ్చాయి. అందుకు భిన్నంగా జిల్లాలో గత ఏడాది ఆగస్టు నాటికి కొత్తగా 16,818 ఓట్లు చేరితే, అంతకన్నా రెట్టింపు సంఖ్యలో 33,957 ఓట్లను తొలగించారు. దీంతో గత మార్చి నెలలో 20.12 లక్షల వరకూ ఉన్న ఓటర్ల సంఖ్య ఆర్నెల్లలో 19.95 లక్షలకు తగ్గిపోయింది. ఇలా తొలగించిన ఓట్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులవే ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. సాధారణ ఎన్నికల వరకూ ఓట్ల నమోదు ప్రక్రియ ఉంటుందని, అక్రమాలు జరిగితే సరిదిద్దుతామని అటు నుంచి హామీ వచ్చింది.
సర్వే బృందాల హల్‌చల్
ప్రభుత్వ వ్యతిరేకులు, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించాలనే ఉద్దేశంతో ‘సర్వే’ ముసుగులో ఇటీవల వరకూ ప్రతి మండలంలోనూ బృందాలు దిగాయి. టీడీపీ ప్రోత్సాహంతో ఓటరు గుర్తింపు కార్డు నంబరు, ఆధార్ నంబరు సహా వారి వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేయడంపై గగ్గోలు రేగిన సంగతి తెలి సిందే. ఇంతలోనే ఫారం–7 దుర్వినియోగం గురిం చి వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.
తహసీల్దార్ల ఫిర్యాదులే ఆధారంగా...
ఆన్‌లైన్‌లో దాఖలైన ఫారం–7పై దరఖాస్తుదారుడిగా ఉన్న వారెవ్వరో గుర్తించి, అసలు దాఖలు చేసింది వారేనా? లేదా వారి పేర్లతో వేరెవ్వరైనా దాఖలు చేశారా? అని పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ఐపీ ఆధారంగా ఎక్కడి నుంచి ఈ దరఖాస్తులు వచ్చాయో పరిశీలించాల్సి ఉంది. కానీ ఫారం–7 దరఖాస్తులపై పేరున్న లేదా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా పోలీసుల చర్యలు ఉంటున్నాయి. ఇందుకు తహసీల్దార్లు ఇస్తున్న ఫిర్యాదులను ఆధారంగా చేసుకుంటున్నారు. ఈ తరహా చర్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలంటూ ఆ పార్టీ బూత్ కమిటీ సభ్యుల పేర్లతోనే అక్రమంగా దాఖలైన ఫారం–7 ఇప్పుడు పోలీసులకు ఆయాచిత వరమైంది. ఆన్‌లైన్‌లో అక్రమంగా దరఖాస్తు పెట్టిన అక్రమార్కులను వదిలేసి, ఆ పేరున్న ప్రత్యర్థి పార్టీ శ్రేణులపై ఓవరేక్షన్ చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి! ఈ తరహా పక్షపాత వైఖరిని సహించబోమని, తప్పకుండా వ్యతిరేకిస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు.
ఆరోపిస్తే కేసులే....
♦ పలాస నియోజకవర్గంలోని మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలతోపాటు పలాస మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 38 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఫారం–7 ద్వారా ఓట్లు తొలగించాలని దొంగ దరఖాస్తు చేశారనే నెపంతో ఈ కేసులు నమోదు చేశారు. ఇందులో పలాసలో 12 మంది, మందసలో 14 మంది, వజ్రపు కొత్తూరులో 12మంది ఉన్నారు.
♦ ∙శ్రీకాకుళం రూరల్ మండలంలో 907 మందిపై కేసులు నమోదయ్యాయి. గార మండలంలో ఒకరిపై బైండోవర్ కేసు నమోదైంది.
♦ పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేటలో మొత్తం 30 మంది, పాలకొండలో 38 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి.
♦ ఎచ్చెర్ల నియోజకవర్గంలోని 115 పంచాయతీల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 3,680 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.
♦ నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు చెందిన 950 మంది నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.
♦ రాజాం నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సంబంధించి ఇప్పటివరకు 720 మందిపై, పాతపట్నం నియోజకవర్గంలో 45 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment