వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు.
వింజమూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు.
స్థానిక వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి నివాసంలో గురువారం ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని కోరినందుకు విజయమ్మను, పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యానికి రాష్ట్ర చరిత్రలో ఇదొక దుర్దినం అన్నారు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం కనుసన్నల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కలిసి విభజన కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ విభజించినా సీఎం ఉత్తుత్తి మాటలు చెప్పి జనాన్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విభజనను వ్యతిరేకించినందుకు వైఎస్సార్‌సీపీ సభ్యులను సస్పెండ్ చేసి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా చర్చించేందుకు టీడీపీ, కాంగ్రెస్ కలిసి నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. ఆయన వెంట జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి ఉన్నారు.
నేడు నిరసనలు : అసెంబ్లీ ఆవరణలో వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేల అరెస్ట్‌కు వ్యతిరేకంగా శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మేరిగ మురళీధర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిరసనను కార్యకర్తలు, నాయకులు విభిన్న రీతుల్లో చేపట్టాలన్నారు.