ఇమేజ్.. డ్యామేజి!
♦ అసాంఘిక కార్యకలాపాలకు అండగా నిలుస్తున్న కొందరు పోలీసులు
♦ దొంగలు కాజేసిన సొమ్మునూ నొక్కేస్తున్న వైనం!
♦ పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోతున్న ఖాకీలు
♦ సీరియస్‌గా దృష్టిసారించిన అర్బన్, రూరల్ ఎస్పీలు
సాక్షి, గుంటూరు : కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది కనిపించని నాలుగో సింహంలా సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటే.. మరికొందరు మాత్రం ధనార్జనే థ్యేయంగా పోలీసు శాఖ పరువును బజారున పడేస్తున్నారు. పేకాట, వ్యభిచారం, క్రికెట్ బెట్టింగ్‌లు, బియ్యం, ఇసుక అక్రమ రవాణాలకు పాల్పడే అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తూ పోలీస్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారు. పోలీస్‌శాఖకు మచ్చ తెచ్చే కొన్ని సంఘటనలను పరిశీలిస్తే...
గుంటూరు అర్బన్ జిల్లా అరండల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన సీతామహాలక్ష్మి అనే మహిళా న్యాయవాది హత్య కేసులో ఆధారాలు తారుమారు చేసినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపించాయి. దీనిపై విచారణ నిర్వహించిన అప్పటి ఎస్పీ రాజేష్‌కుమార్ ఇద్దరు అధికారులతోపాటు ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.
చోరీ కేసులో నిందితున్ని అదుపులోకి తీసుకుని అతను ఇచ్చిన సమాచారం మేరకు బంగారాన్ని రికవరీ చేసి బాధితులకు ఇవ్వకుండా నొక్కేశారు. ఇలాంటి ఘటనలు ఒక్క అర్బన్ జిల్లా పరిధిలోనే రెండు వెలుగు చేశాయి. ఈ వ్యవహారంలో గతంలో ఇక్కడ పనిచేసిన ఓ డీఎస్పీతోపాటు ఇద్దరు సీఐలు, ఒక ఎస్‌ఐ పాత్ర కూడా ఉన్నట్లు రూరల్ సీసీఎస్, కాకినాడ సీసీఎస్ పోలీసులు గుర్తించి అప్పటి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. చర్యలు చేపట్టేలోపు ఆయన బదిలీపై వెళ్ళారు.
గుంటూరులోని ఓ పోలీస్‌స్టేషన్‌లో వ్యభిచారం చేస్తున్న మహిళను తీసుకువచ్చి ఉంచగా ఓ కానిస్టేబుల్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె జడ్జికి ఫిర్యాదు చేశారు.
గుంటూరులోనే ఓ లాడ్జిలో కొందరు కానిస్టేబుళ్లు పేకాట ఆడుతుండగా అడిషనల్ ఎస్పీ స్వయంగా దాడిచేసి నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో అడిషనల్ ఎస్పీ గన్‌మెన్ కూడా ఉండటం గమనార్హం.
తాజాగా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని పెదనందిపాడు పోలీస్‌స్టేషన్‌ను అకస్మికంగా తనిఖీ చేస్తున్న సమయంలో కొందరు కానిస్టేబుళ్లు పోలీస్‌స్టేషన్ ఆవరణలోని ఓ గదిలో పేకాట ఆడుతున్నట్లు రూరల్ ఎస్పీ నారాయణనాయక్ గుర్తించి దీనిపై రిపోర్టు పంపాలని అక్కడి పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టినప్పటికీ కొందరు పోలీసులు మాత్రం వక్ర మార్గాలనే అనుసరిస్తున్నారు. ఇలాంటి వారి కదలికలపై గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, నారాయణ నాయక్‌లు సీరియస్‌గా దృష్టి సారించారు.