జనస్వామ్యం ఖూనీ
అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ గూండాగిరీ
ఇడుపులపాయలో పోలీసుల వీరంగం
సాక్షి, పులివెందుల/వేంపల్లె, కడప, నెల్లూరు: అధికారాన్ని అడ్డంపెట్టుకుని తెలుగుదేశం సాగిస్తున్న గూండాగిరీకి అంతులేకుండా పోతోంది. ప్రజాస్వామ్యాన్ని వలువలూడదీసి ఖూనీ చేస్తున్నారని, అధికార బలంతో తమ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఇటు గవర్నరుకు, అటు రాష్ట్రపతితో సహా కేంద్ర హోంమంత్రికి సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అయినా సరే దేశం ఆగడాలు కించిత్తు కూడా ఆగలేదు. సరికదా... మరింత రెచ్చిపోయింది. ఆఖరికి శనివారంనాడు పులివెందులలోనే పోలీసుల చేత తనిఖీలు చేయించింది.
ఎలాంటి వారంటూ లేకుండా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌లో, పొలాల్లో పోలీసులు స్వైరవిహారం చేశారంటే ఇది ఏ స్థాయి దారుణమన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ చిత్రమేంటంటే... పోలీసులు అలా సోదాలు చేసింది వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీల కోసమట!! తమ వారు కిడ్నాపైనట్టు వైఎస్సార్‌సీపీ నెల్లూరు జెడ్పీటీసీలిద్దరి తరఫున ఫిర్యాదు దాఖలైందని, అందుకోసమే ఇడుపుల పాయలో వెదికామన్నది పోలీసుల వివరణ. అసలు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు కిడ్నాపైతే వెదకాల్సింది ఎక్కడ? టీడీపీ నేతల ఇళ్లలోనా లేక వైఎస్సార్‌సీపీ అధిపతికి చెందిన తోటలోనా? ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ సంఘటన పూర్వాపరాలివీ...
నెల్లూరు జిల్లా పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో అక్కడ మొత్తం 46 స్థానాలుండగా 31 సీట్లను వైఎస్సార్ సీపీ గెల్చుకుంది. టీడీపీకి 15 మాత్రమే దక్కాయి. అయితే రాష్ట్రంలో అధికారం దక్కటంతో దీన్ని చేజిక్కించుకోవడానికి టీడీపీ కుట్రలకు తెరలేపింది. ఫలితంగా ఈ నెల 5న చైర్మన్ ఎన్నిక జరిగేటపుడు దేశం సభ్యులు వీరంగం సృష్టించారు. కలెక్టర్, పోలీసుల సమక్షంలోనే ఈ ఘర్షణలు జరిగినా వారు నిలువరించలేదు సరికదా.. పరిస్థితి అదుపు తప్పిందంటూ ఎన్నికను వాయిదా వేశారు. దీంతో ఈనెల 8 నుంచీ వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలంతా ఒక్కటిగా ఇడుపులపాయలో మకాం వేశారు.
అయితే వాయిదా పడిన ఎన్నిక మళ్లీ ఆదివారం నాడు జరగనున్న నేపథ్యంలో టీడీపీ నేతలు తమ కుట్రలకు మరింత పదును పెట్టారు. తమ వారిని కిడ్నాప్ చేశారంటూ ఇద్దరు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీల బంధువులతో కేసులు పెట్టించారు. కావలి జెడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మను చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కిడ్నాప్ చేశారంటూ కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందుకూరుపేట జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణయ్యను సైతం బొమ్మిరెడ్డి కిడ్నాప్ చేసినట్లు కేసు పెట్టారు. వైఎస్సార్సీపీకి చెందిన సభ్యుల్ని ఆ పార్టీ నేతలు కిడ్నాప్ చేయటమేంటన్నది సామాన్యులకు అర్థం కాకపోయినా... ఆ కేసుల్ని ఆసరాగా తీసుకుని నెల్లూరు పోలీసులు పులివెందులపై దండెత్తారు. మూకుమ్మడిగా ఇడుపులపాయకు వెళ్లారు. శనివారం ఉదయం 10.30 సమయంలో నెల్లూరు రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో పులివెందుల సీఐ మహేశ్వరరెడ్డితో పాటు మరో 100 మంది పోలీసులు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో తనిఖీలకు దిగారు.
ఒక్కసారిగా ఎస్టేట్‌లో భారీగా పోలీసు బలగాలు మోహరించటంతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. తీరా ఆరాతీయగా... నెల్లూరు జెడ్పీటీసీలు ఇద్దరు కిడ్నాప్ అయినట్లు వారి బంధువులు ఫిర్యాదు చేశారని, వారిచ్చిన సమాచారం మేరకు సోదాలకు దిగామని పోలీసులు చెప్పారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు ఎలా చేస్తారంటూ నెల్లూరు జెడ్పీటీసీలు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు గట్టిగా ప్రశ్నించారు. కొంతసేపు పోలీసులతో వాగ్వాదం నడిచింది. ఇంతలో తమకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయని.. అందుకు అనుగుణంగానే ఈ ఇద్దరిని కిడ్నాప్ చేసి ఇడుపులపాయలో ఉంచారన్న సమాచారం మేరకు, వారి బంధువుల సమక్షంలో సోదాలు చేస్తున్నామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌లో ఎలాంటి అనుమతి లేకుండా తనిఖీలు చేయటంపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా నిరసించినా ఫలితం లేకపోయింది.
ఇంతలో మీడియా ప్రతినిధులు రావటంతో పోలీసులు గేటు లోపలికి వచ్చి... సాయంత్రం 5.30 వరకు అక్కడే ఉన్నారు. ఇడుపులపాయ చుట్టుపక్కలి ప్రాంతాలతో పాటు తోటల్లో, పార్కుల్లో పోలీసులు కలియతిరిగారు. ఎక్కడైనా జెడ్పీటీసీలు ఉన్నారేమోనని అనుమానంతో వెదికినట్లు చెప్పారు. అక్కడితో ఆగకుండా... జెడ్పీటీసీలంతా నెల్లూరుకు బయల్దేరగా, ఆ బస్సులో కూడా తనిఖీలు చేశారు. చివరికి కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు చెప్పిన జెడ్పీటీసీలు అక్కడ లేకపోవటంతో పోలీసులు వెనుదిరిగారు. కాగా తాజా కుట్రల నేపథ్యంలో హైకోర్టు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో ఆదివారం జరిగే ఎన్నికయినా సజావుగా నిర్వహిస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకు వాయిదా పడిందంటే...
ఈ నెల 5న నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరుగుతుండగా టీడీపీ నేతలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోనే దూషణలకు దిగారు. వెంకటగిరి ఎమ్మెల్యే కె.రామకృష్ణ వీరంగం సృష్టించి, కలెక్టర్ శ్రీకాంత్ ముందున్న మైక్‌ను విసిరికొట్టారు. ఆయన్ను దూషించారు. అయినా కలెక్టర్ నోరు మెదపలేదు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులపై దాడికి దిగారు. మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కలెక్టర్ , ఎస్పీ అక్కడే ఉన్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అనంతరం ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తరవాత జెడ్పీ హాల్లో వీరంగం సృష్టించిన రామకృష్ణపై జెడ్పీ సీఈఓ జితేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 353,447 రెడ్‌విత్ 34 పీడీ పీపీయాక్ట్(నాన్‌బెయిలబుల్) కింద కేసులు పెట్టారు.
అయితే టీడీపీ నేతలు ఒత్తిడి చేయటంతో పాటు సాక్షాత్తు ప్రభుత్వాధినేత సైతం జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ వెళ్లి శనివారం తిరిగి నెల్లూరుకు వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణను పోలీసులు లైట్ తీసుకున్నారు. సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఆయన 40 వాహనాలతో సిటీలో 10 కిలోమీటర్ల మేర ర్యాలీ జరిపి.. తరవాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కూర్చోగా... పోలీసులు బెయిల్ ఇస్తున్నట్లు చెప్పి పంపించేశారు. అక్కడికెళ్లిన మీడియాను ఇన్‌స్పెక్టర్ అడ్డుకోవడం గమనార్హం.
నెల్లూరు జెడ్పీని దక్కించుకుంటాం
నెల్లూరు జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు శాయశక్తులా కృషి చేస్తామని నెల్లూరు జెడ్పీటీసీలు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి స్పష్టం చేశారు. శనివారం ఇడుపులపాయలో పోలీసుల తనిఖీ సంగతి తెలియగానే ఆయన అక్కడికి చేరుకున్నారు. అనంతరం జెట్పీటీసీలతో ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్ సీపీ తరపున గెలిచి.. ప్రలోభాలకు గురి కావాల్సిన అవసరం తమకు లేదని.. ధైర్యంగా వైఎస్‌ఆర్ సీపీకి ఓట్లేస్తామని వారు చెప్పారు. టీడీపీ ప్రలోభాలకు లొంగి కొంతమంది వెళ్లినా కావాల్సిన బలం ఉందని వారు స్పష్టంచేశారు.
ఖాకీ విప్పి పచ్చచొక్కాలు వేసుకోండి
నెల్లూరు జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్ మొదలైంది. వారు టీడీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారు. అందుకని ఖాకీ చొక్కాలు విప్పి.. పచ్చచొక్కాలు వేసుకుంటే బాగుంటుంది. పోలీసుల పనితీరు సరిగా లేకపోవటం వల్లే జెడ్పీ ఎన్నిక వాయిదా పడింది. ఇలా చేసే బదులు పోలీసులు టీడీపీలో చేరిపోతే బాగుంటుంది.
- పులివెందులలో కాకాని గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లె వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే
సీఎం ఆదేశాల మేరకే దాడులు
రాష్ట్రంలో నెల్లూరు రాజకీయాలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ ఆ పేరును టీడీపీ నేతలు మంటగలిపారు. 50 ఏళ్ల నెల్లూరు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఈనెల 5వ తేదీన నెల్లూరు జడ్పీ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఐఏఎస్ అధికారిపైనే టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. పోలీసులు కేసు పెట్టారు కానీ అరెస్టు చేసిన పాపాన పోలేదు. టీటీడీ ఎన్ని చేసినా నెల్లూరు జెడ్పీలో గెలుపు మాదే.
- కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
అసభ్యంగా మాట్లాడుతున్నారు
మేం మహిళలం అని కూడా చూడకుండా నెల్లూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు జెడ్పీటీసీలను కిడ్నాప్ చేశారనే నెపంతో పోలీసులు ఇక్కడ తనిఖీలు చేయడం బాధాకరం. ఈ నెల 7న మేమంతా తమిళనాడులో ఉండగా అక్కడ కూడా తమిళ పోలీసుల సాయంతో మా శిబిరంలో తనిఖీలు చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రాణం పోయేంతవరకు వైఎస్‌ఆర్ సీపీలోనే ఉంటాం. నెల్లూరు జెడ్పీని కైవసం చేసుకుంటాం. ఆదివారంనాటి ఎన్నికల్లోనైనా పోలీసులు ప్రేక్షకుల్లా మారకుండా శాంతిభద్రతలు కాపాడతారని అనుకుంటున్నాం.
- నెల్లూరు మహిళా జెడ్పీటీసీల ఆవేదన