రాజకీయ హత్య... | political murder | Sakshi
Sakshi News home page

రాజకీయ హత్య...

Published Tue, Jan 7 2014 4:55 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

political murder

 హుజూరాబాద్, న్యూస్‌లైన్ : వీణవంక మండలం నర్సింగాపూర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఉయ్యాల బాలరాజు దారుణహత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. ఇంతకు ముందు కూడా రాజకీయ నాయకులు హత్యకు గురైనప్పటికీ వారి కుటుంబసభ్యులో, లేక ఇతర మిత్రులో చంపడం జరిగింది. తొలిసారిగా రాజకీయ కక్షలతో బాలరాజును మట్టుబెట్టడం చర్చనీయాంశమైంది. ఫ్యాక్షన్ రాజకీయాలను తెరకెక్కిస్తూ, గొడ్డళ్లతో ఓ మాజీ ప్రజాప్రతినిధిని హత్య చేయడం వెనుక ప్రస్తుత ప్రజాప్రతినిధి హస్తం ఉందని తెలియడంతో అన్ని పార్టీల నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 గ్రామ సర్పంచ్, మరో ఇద్దరి హస్తం..
 బాలరాజును పక్కా పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. నర్సింగాపూర్ సర్పంచ్ జడల రమేశ్, అత డి బావమరిది వంగ రమేశ్, మరో వ్యక్తి రవీందర్‌రెడ్డి కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాలరాజు హత్యకు గురైన ప్రదేశంలో కుమార్ అనే వ్యక్తి ఉండడంతో అనుమానించి పోలీసులు అతడిని విచారణ జరపగా.. వారి పేర్లు వెల్లడించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బాలరాజుపై రమేశ్ సర్పంచ్‌గా గెలుపొందాడు. చేనేత సంఘం ఎన్నికల్లో రమేశ్ విజయం సాధించాడు. దీంతో గ్రామంలో వీరిద్దరి మధ్య వైరం నెలకొన్నట్లు తెలిసింది. పలుమార్లు వాగ్వివాదానికి దిగినట్లు చెబుతున్నారు. రమేశ్‌ను, అతడి కుటుంబసభ్యులను బాలరాజు అసభ్యపదజాలంతో దూషించాడని, ప్రతి విషయంలో, రాజకీయంగా తనకు అడ్డు వస్తున్నందునే రమేశ్ ఈ హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

 రాజకీయ వర్గాల్లో కలకలం..
 వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, పత్రికల ద్వారా ఆరోపించుకోవడం మాత్రమే జరిగేది. ఎన్నికల సమయంలోనూ బరిలో నిలిచేవారు వాగ్వివాదాలు చేసుకోవడం, ఎన్నికలు పూర్తికాగానే గెలుపోటములతో సంబంధం లేకుండా కలిసిపోవడం చూస్తున్నాం. తొలి సారిగా ఫ్యాక్షన్ రాజకీయాలకు అంకురార్పణ చేస్తూ ఈ హత్య జరగడంతో హుజూరాబాద్ ప్రాంతంలోని రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది. వచ్చేది న్నికల సీజన్ కావడం, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ హత్య జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement