పట్నంబజారు(గుంటూరు) : తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. స్థానిక కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో శనివారం ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ,సీపీఎంలతో పాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఏపీ ఎన్జీవో, కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు.
తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు రాజకీయపార్టీలు, కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ తమ న్యాయమైన కోర్కెల కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని, ప్రజలపై చార్జీల భారం మోపేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించిన తనకు కార్మికుల కష్టాలు తెలుసని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్న టీడీపీ నేతలు, ఇక్కడ లాఠీచార్జీ చే యించడంపై మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ 16 డిగ్రీల ఏసీ బాక్సుల వద్ద కూర్చుని కార్మికులు ఉద్యోగాలు చేయటం లేదని, 43 డి గ్రీల ఎండలో కష్టం చేస్తున్నారన్న సంగతి గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు మాట్లాడుతూ లాఠీచార్జీలకు భయపడేది లేదని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మెకు పూర్తి మద్దతునిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఆదివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీ రాస్తారోకో, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, పలు రాజకీయ పార్టీల నాయకులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, కోటా మాల్యాద్రి, నళినీకాంత్, వై.నేతాజీ, షేక్ అమీర్‌వలి, శివరాత్రి శ్రీనివాసరావు, ఎన్‌వీకే రావు, భగ వాన్‌దాస్, చల్లా చిన ఆంజనేయులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఆందోళనకు పలు పార్టీల మద్దతు
Published Sun, May 10 2015 2:35 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement