ఏపీ సర్కార్‌కు రివర్స్ పంచ్ పడింది...
- నిబంధనలకు విరుద్ధంగా అరెస్టుపై తెలంగాణా పోలీసుల అభ్యంతరం
- న్యాయ నిపుణులు, సామాజిక మాధ్యమాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు
- రవికిరణ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టని పోలీసులు
- హెబియస్‌కార్పస్ పిటిషన్ వేసేందుకు సిద్ధమై రవికిరణ్ భార్య
- ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో తేల్చుకోలేక పోలీసుల తర్జనభర్జనలు
- ఎట్టకేలకు మళ్లీ అతని ఇంటి దగ్గరే వదిలిపెట్టిన పోలీసులు
అమరావతి: సామాజిక మాధ్యమ కార్యకర్త, ‘పొలిటికల్ పంచ్’ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ అక్రమ నిర్బంధం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి రివర్స్ పంచ్ పడింది. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి అడ్డగోలుగా అరెస్టు చేసిన పోలీసుల చర్యపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆత్మరక్షణలో పడిపోయింది. అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు మేరకే అరెస్టు చేశామని సాకులు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతోనే అరెస్టు చేసిందన్న విషయం స్పష్టమైంది. ప్రభుత్వ వైఫల్యాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలను సహించలేని చంద్రబాబు ఆదేశాల మేరకు గుంటూరు పోలీసులు రవికిరణ్‌ను శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై తెలంగాణ పోలీసులు, న్యాయ నిపుణులు, సామాజిక మాధ్యమాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కంగుతింది. మరోవైపు రవికిరణ్ భార్య న్యాయపోరాటానికి సిద్ధపడటంతో ప్రభుత్వంలో కలవరం మొదలైంది. రవికిరణ్‌ను అరెస్టు చేశామని విధిలేని పరిస్థితుల్లో అంగీకరించిన పోలీసులు ఆయన్ను మీడియా ముందు ప్రవేశపెట్టలేకపోయారు. సరికదా ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలనే దానిపై కూడా స్పష్టత లేక మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రవికిరణ్ మీద ఉన్న పాత కేసును తెరపైకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవికిరణ్‌ను తిరిగి అతని ఇంటి వద్దే పోలీసులు వదిలిపెట్టారు.
కాగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత పార్టీ ఫిరాయించినప్పుడు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై రవికిరణ్ మీద గతంలో విశాఖపట్నంలో కేసు నమోదయింది. ఐటీ చట్టం కింద నమోదైన ఆ కేసు విచారణ కోసమే అదుపులోకి తీసుకున్నట్లు చూపించాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు విశాఖపట్నం పోలీసు స్టేషన్లో 19 తేదీన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు అరెస్టు చేశామని చెబుతున్న పోలీసులు ఆ మేరకు అరెస్టును చూపకపోవడం, పలు కొత్త కేసులను పైకి తీసుకురావడం చూస్తుంటే వారు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు
ఇతర రాష్ట్రానికి వెళ్లి అరెస్టు చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను గుంటూరు పోలీసులు ఉల్లంఘించారు. తెలంగాణ పోలీసులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా రవికిరణ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆరు గంటల తర్వాతే అరెస్టు చేయాలనే నిబంధనను పాటించకుండా అర్ధరాత్రి ఒంటిగంటకు అదుపులోకి తీసుకున్నారు. తన భర్తను అపహరించారని, ఆయన ఆచూకీ తెలపాలంటూ రవికిరణ్ భార్య సుజన శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో తెలంగాణా పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు సమాచారం లేకుండా తమ పరిధిలోని వ్యక్తిని ఏపీ పోలీసులు ఎలా అదుపులోకి తీసుకుంటారని తెలంగాణా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు తన భర్త భద్రతపై సందేహాలు ఉన్నాయని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రవికిరణ్ భార్య సుజన ప్రకటించారు. ఈమేరకు హెబియస్‌కార్పస్ పిటిషన్ వేసేందుకు సిద్ధపడటంతో పోలీసుల్లో కలవరం మొదలైంది.
అప్పటివరకూ రవికిరణ్ ఆచూకీపై నోరుమెదపని పోలీసులు స్పందించారు. ఆయన్ను తాము అరెస్టు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ వెల్లడించాల్సి వచ్చింది. అయితే ఆయనను ఎక్కడ ఉంచారో వెల్లడించలేదు. సచివాలయానికి కూతవేటు దూరంలో మందడం ఏఎస్పీ కార్యాలయంలో రవికిరణ్‌ను ఉంచి పోలీసులు పలు దఫాలుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆయన్ని గుట్టుచప్పుడు కాకుండా తిరిగి హైదరాబాద్ తీసుకువెళ్లాలన్న యత్నాలు కూడా ఫలించలేదు.
దాంతో అసలు ఆయన్ని ఇంకా రాజధాని ప్రాంతానికి తీసుకురాలేదని... హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నామని...అమరావతి చేరుకోగానే మీడియా ముందు ప్రవేశపెడతామని ...ఇలా గడియకోమాట చెబుతూ వచ్చారు. అయితే మందడం గ్రామంలో ఉన్న ఏఎస్పీ కార్యాలయంలో రవికిరణ్ ఉన్నాడన్న సమాచారంతో మీడియా అక్కడకు చేరుకుంది. కానీ పోలీసు అధికారులు మీడియాను అనుమతించలేదు. రవికిరణ్ ఎక్కడున్నారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పోలీసులను ఎంతగా అడిగినప్పటికీ ఫలితం లేకపోయింది. రాత్రి తొమ్మిది గంటలవరకు కూడా ఆయన్ను మీడియా ముందు ప్రవేశపెట్టనేలేదు.
రహస్య ప్రాంతానికి తరలింపు!
రవికిరణ్‌ను శుక్రవారం రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. మందడంలోని ఏఎస్పీ కార్యాలయం ఉన్న వీధిలో రాత్రి 10గంటల సమయంలో అరగంటపాటు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలోనే ఏఎస్పీ కార్యాలయం ఎదుట వాహనాలు వచ్చాయి. ఆ పరిసరాలకు పోలీసులు ఎవర్నీ అనుమతించలేదు. ఆ తరువాత ఆ వాహనాలు అతి వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆ వాహనాల్లోనే రవికిరణ్‌ను ఓ రహస్య ప్రాంతానికి తరలించారు. చివరకు హైడ్రామా నడుమ రవికిరణ్ తిరిగి శంషాబాద్‌లోని అతని నివాసం వద్ద వదిలిపెట్టారు.