విజయ డెయిరీలో మళ్లీ సవతి పోరు | Political rift in Vijay Diary directors' elections | Sakshi
Sakshi News home page

విజయ డెయిరీలో మళ్లీ సవతి పోరు

Published Sun, Sep 15 2013 1:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య విజయవాడ డెయిరీలో సవతి పోరు మళ్లీ మొదలైంది. చైర్మన్ మండవ జానకి రామయ్యకు...

విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య విజయవాడ  డెయిరీలో  సవతి పోరు మళ్లీ మొదలైంది. చైర్మన్ మండవ జానకి రామయ్యకు చెక్ పెట్టేందుకు పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గీయులు  గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్దనరావును రంగంలోకి దించారు. పాలక వర్గ డెరైక్టర్ ఎన్నికల్లో దాసరితో నామినేషన్ దాఖలు చేయించారు. ఈ మేరకు శనివారం విజయ డెయిరీలో మూడు డెరైక్టర్ల ఎంపిక కోసం 15 మంది కోలాహలంగా  నామినేషన్లు వేశారు. దాంతో విజయ డెయిరీ పాలకవర్గంలో టీడీపీకి చెందిన వైరి వర్గాల మధ్య విభేదాలు బయట పడ్డాయి.

మండవ జానకి రామయ్యను గద్దె దించేందుకు రెండేళ్లుగా విజయ డెయిరీ పాలకవర్గ సభ్యులు పోరాడుతూనే ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఖాళీ అయిన పాలకవర్గ డెరైక్టర్లకు జానకి రామయ్య వ్యతిరేక వర్గీయులు నామినేషన్లు  వేసి హడావిడి చేశారు.  గత  సంవత్సరం కూడా  దాసరిని పోటీ చేయించేందుకు తెలుగుదేశం శ్రేణులు ప్రయత్నించాయి. దాంతో జానకిరామయ్య ఈ గొడవను చంద్రబాబు వద్ద పంచాయతీపెట్టారు. చంద్రబాబు జిల్లా నాయకులను పిలిచి మాట్లాడి దివంగత నాయకుడు ఎర్రంనాయుడును సర్దుబాటు చేయమని ఆదేశించారు.  

ఎర్రం నాయుడు కిందామీదా పెట్టి  గొడవను సర్దుబాటు చేసి వైరి వర్గాల మధ్య తాత్కాలిక   ఒప్పందం కుదిర్చారు. విజయ డెయిరీ పాలక వర్గంలో మొత్తం 15 మంది డెరైక్టర్లు ఉన్నారు. జానకిరామయ్య వర్గానికి 8మంది, వ్యతిరేకవర్గంలో 7గురు డెరైక్టర్లు ఉండగా ఈ సంవత్సరం ముగ్గురు డెరైక్టర్ల పదవీకాలం పూర్తయింది.  ఈ నేపధ్యంలో ఈ సంవత్సరం ఇద్దరు పురుష, ఒక మహిళా డెరైక్టర్ల పదవీకాలం పూర్తవటంతో ఈ నెల 20న ఎన్నికలు జరపటానికి నోటిఫికేషన్ జారీ చేశారు. పాలకవర్గంలో 15 మందిలో ఆదిపత్యం సాదించి జానకి రామయ్యను  అవిశ్వాసం ద్వారా  గద్దె దించాలని  తెలుగుదేశం పార్టీ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది.  

పోటాపోటీగా నామినేషన్లు ....

విజయవాడ  డెయిరీ  పాలక వర్గానికి ఖాళీ అయిన మూడు డెరైక్టర్ల పోస్టులకు శనివారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జానకిరామయ్య తన వర్గీయులతో నామినేషన్లు దాఖలు చేయించారు. జానకి రామయ్య వర్గానికి వ్యతిరేకంగా  టీడీపీ నాయకులు మూడు డెరైక్టర్లకు నామినేషన్లు దాఖలు చేశారు.  గన్నవరం  ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావు, తిరువూరుకు చెందిన కృష్ణమోహన్, మహిళా డెరైక్టరుగా విస్సన్నపేటకు చెందిన వాణిశ్రీ, బాల రమాదేవీ నామినేషన్లు వేశారు. జానకి రామయ్య వ్యతిరేక వర్గమైన దాసరి వర్గీయులకు మద్దతుగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వరరావు, కాట్రగడ్డబాబు, బుద్దావెంకన్నతోపాటు  నగరంలో జిల్లాలో అన్ని నియోజక వర్గాలనుంచి పార్టీ ఇన్‌చార్జ్‌లు, నాయకులు కోలాహలంగా నామినేషన్ కార్యక్రమానికి హాజరవ్వటం చర్చనీయాంశమైంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement