
చంద్రబాబు అటూ, ఇటూ మోసం చేస్తున్నారు: జగన్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ, సీమాంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.
చిత్తూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ, సీమాంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ తలపెట్టిన సమైక్య శంఖారావం - ఓదార్పు యాత్ర మంగళవారం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్ర విజభనపై చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఇరు ప్రాంతాల్లోనూ డ్రామాలాడిస్తున్నారని జగన్ అన్నారు. రాహుల్ను ప్రధానిని చేయడం కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు.
రాజకీయాలంటే రాష్ట్రాన్ని ఎలా విడగొట్టి, ఓట్లు ఎలా దండుకోవాలని ఆలోచించడం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. పేదవాడి గుండెల్లో ఎలా బతకాలో నేర్చుకోవాలని హితవు పలికారు. సమైక్య శంఖారావం - ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ ఈరోజు నారాయనవనం గ్రామంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. శాసనసభ హాలులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాలవారితో విభిన్న వాదనలు చేయిస్తున్నారని చెప్పారు. పార్టీ అన్నాకా ఆ నాయకుడికి విశ్వశనీయత ఉండాలన్నారు. ప్రజలకు న్యాయం చేసే దమ్ము కూడా ఉండాలన్నారు.
రాబోయే లోక్సభ ఎన్నికలలో 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందామని, అప్పుడు మన రాష్ట్రాన్ని ఎవరు విడగొడతారో చూద్దాం అని అన్నారు. సమైక్యం అన్నవారినే ప్రధానిని చేద్దాం అన్నారు. ఇది ఢిల్లీ అహంకారానికి తెలుగువారి ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. పేదరికానికి వైద్యం చేయాలంటూ ఆలోచించిన నేత వైఎస్ఆర్ అని చెప్పారు. ఆరోగ్యశ్రీతో ధనవంతుని బెడ్ పక్కనే పేదవానికి వైద్యం చేయించిన ఘనత వైఎస్ఆర్ది అని గుర్తు చేశారు. మన నీటి కోసం మనమే కొట్టుకు చావాలా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను విడచి వెళ్లిపోవాలంటే వెళ్లిపోవాలా? అని జగన్ అడిగారు.