పోస్టల్ బ్యాలెట్‌పై నజర్
- ఉద్యోగులపై దృష్టి సారించిన అభ్యర్థులు
- ఈ నెల 16 వరకు పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం
- ఆదిలాబాద్, నిర్మల్‌లోనే అత్యధికంగా వినియోగం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : నిన్నా మొన్నటి వరకు ఓట్ల వేటలో తిరిగిన అభ్యర్థులంతా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్‌పై దృష్టి సారించారు. ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసైనా ఓట్లు రాబట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ నెల 16 వరకు పోస్టల్ బ్యాలెట్ దాఖలు చేసేందుకు అవకాశం ఉండడంతో అభ్యర్థులు తమ పనిని వేగవంతం చేశారు. గత నెల 30న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో 73.70 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. అయితే.. వాటితో పాటే అభ్యర్థుల గెలుపునకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ప్రధానమే అయ్యాయి.
జిల్లావ్యాప్తంగా 18 వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. ఇప్పటి వరకు 13,443 మంది దాఖలు చేశారు. మిగిలిన ఉద్యోగుల వివరాలు సేకరిస్తూ.. పరిచయం ఉన్న పక్షంలో నేరుగా, లేనిపక్షంలో వారి సంబంధీకుల ద్వారా పోస్టల్ బ్యాలెట్ తమకు అనువుగా మలుచుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు దాఖలైన పోస్టల్ బ్యాలెట్‌లో ఆదిలాబాద్, నిర్మల్ నుంచే అత్యధికంగా ఉన్నాయి.
విజయావకాశాలు..
జిల్లాలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ అహ్మద్‌బాబు ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు పోలింగ్ డ్యూటీ కేటాయించే సమయంలోనే వారి ఎపిక్ నంబర్లను సైతం సేకరించారు. అన్ని మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాల్లోనూ పోలింగ్ బాక్సులను ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. పలువురు ఉద్యోగులు ఎన్నికల తేదీ 30 కంటే ముందే తమ ఓటును వినియోగించుకోగా..
ఇంకొంత మంది పోస్టల్ ద్వారా తమ బ్యాలెట్‌ను నేరుగా నియోజకవర్గ కేంద్రాలకు పంపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఒక్కోసారి అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నాయి. 2009 ఎన్నికల్లో ముథోల్ టీడీపీ అభ్యర్థి వేణుగోపాలచారి, ప్రజారాజ్యం అభ్యర్థి విఠల్‌రెడ్డికి సుమారు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించాల్సి వచ్చింది. చివరికి వేణుగోపాలాచారిని విజయం వరించింది. ఈసారి కూడా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు పోటాపోటీగా ఉండడంతో పోస్టల్ బ్యాలెట్ కీలకం కానుంది.