రాజకీయం రాష్ట్రాన్ని ముక్కలు చేసింది
- తెలుగు సాహితీ సదస్సులో బుద్ధప్రసాద్
విజయవాడ కల్చరల్ : ప్రపంచం తెలుగువారికి వేదిక కావాలని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య ముమ్మనేని సుబ్బారావు కళాపీఠం సంయుక్త నిర్వహణలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన తెలుగు సాహితీ సదస్సులో మాట్లాడుతూ,తెలుగు భాషాసంస్కృతుల సమ్మేళనమే ప్రపంచ తెలుగు సమాఖ్యఅని, భాషా సంస్కృతులను వాటి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి అభివృద్ధికోసం ప్రపంచ తెలుగు సమాఖ్య పాటుపడుతోందని వివరించారు.
ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా వారిని ఏకం చేసేది సాంస్కృతిక వారసత్వమేనని గుర్తుచేశారు. రాజకీయం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని కొత్తరాష్ట్రంలోని కవులు రాష్ట్ర ప్రజలను చైతన్య పరిచేలా రచనలు చేయాలని ఉద్భోదించారు. భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మాట్లాడుతూ భాషా సంస్కృతీ సంప్రదాయాలను కవులు గౌరవించి తమ రచనల ద్వారా తెలుగు జాతిని జాగృత పరచాలన్నారు. కవి సమ్రాట్ విశ్వనాథ ఇంటిని ముఖ్యమంత్రి గారితో కలసి సందర్శించి, విశ్వనాథగృహాన్ని తెలుగు భాషా సంస్కృతులు వెల్లివిరిసేలా పరిరక్షిస్తామన్నారు.
ప్రారంభ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు జ్యోతిని వెలిగించి తెలుగు సాహితీ సదస్సులను ప్రారంభించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షులు వియల్ ఇందిరాదత్ మహాసభ లక్ష్యాలను వివరించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వాధ్యక్షులు ఆవుల మంజులత, సిద్ధార్థఅకాడమీ కార్యదర్శి పాలడుగు లక్షణరావు, కష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పాలడుగు లక్షణరావు పాల్గొన్నారు.
మాతెలుగు తల్లికి మల్లెపూదండ...
సభా ప్రారంభానికి ముందు ప్రపంచ తెలుగు సమాఖ్య అద్యక్షులు వి.ఎల్. ఇందిరాదత్, పొట్టి శ్రీరాములు తెలుగు విద్యాలయం పూర్వధ్యక్షులు ఆవుల మంజులత,కవులు డాక్టర్ జి.వి.పూర్ణచందు, చలపాక ప్రకాష్, గుమ్మా సాంబశివరావు, ఎరుకలపూడి గోపీనాథరావు, సీహెచ్.బృందావనరావు కళాక్షేత్రం వద్దనున్న తెలుగు తల్లివిగ్రహానికి పూలమాలలు వేశారు.
పరిశోధనా పత్రాలు సమర్పణ...
వెంకటగిరి సంస్థానంలో తెలుగు సాహిత్య కృషి అంశంపై డాక్ట్‌ర్ సాయికృష్ణ యాచేంద్ర ,తెలుగు ప్రాచీన సాహిత్యం సామాజిక అంశాల అవశ్యకతపై యార్లగడ్డ బాలగంగాధరరావు, నన్నయ్య పూర్వయగంపై ఆచార్య టి .సత్యవతి, కాకతీయానంతర సాహిత్య నేపథ్యంపై ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య పరిశోధనా పత్రాలను సమర్పించారు. అనంతరం కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యామ్,శిష్యబృందం ప్రదర్శించిన పార్వతీ కల్యాణం ప్రేక్షకులను ఆకట్టుకుంది.